Balakrishna’s assets : నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీ. ఆయన హిందూపురం నియోజకవర్గం నుండి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. గత రెండుసార్లు ఆయన విజయం సాధించారు. నేడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అఫిడవిట్ లో తన ఆస్తులతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు వెల్లడించారు. అలాగే అప్పుల లెక్కలు చెప్పారు.
ఇక బాలకృష్ణ సమర్పించిన లెక్కల ప్రకారం ఆయనకు రూ. 81.63 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే ఆయనకు రూ. 9.9 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక భార్య వసుంధర పేరిట ఉన్న ఆస్తుల వివరాలు కూడా ఆయన సమర్పించారు. వసుంధర ఆస్తి విలువ రూ. 140.38 కోట్లు. ఆమెకు రూ. 3.83 కోట్ల అప్పులు ఉన్నాయట. ఇక బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ రూ. 58.63 కోట్లు. మోక్షజ్ఞకు ఎలాంటి అప్పులు లేవు.
మొత్తంగా బాలకృష్ణ కుటుంబానికి రూ. 280.64 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలాగే రూ. 13.73 కోట్ల అప్పులు ఉన్నాయి. బాలకృష్ణ అధికారికంగా ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇవి. ఆంధ్రప్రదేశ్ లో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అనంతరం బాలకృష్ణ తిరిగి షూటింగ్ లో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు బాబీ దర్శకత్వంలో 109వ చిత్రం చేశారు. చాలా వరకు షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం. ఎన్నికల ప్రచారం కోసం షార్ట్ బ్రేక్ ఇచ్చారు.
ఇటీవల విడుదలైన ఎన్బీకే 109 గ్లింప్స్ ఆకట్టుకుంది. బాలయ్య డైలాగ్ దుమ్మురేపింది. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం కలదంటున్నారు. కాగా బాలయ్య వరుస విజయాలతో జోరు మీదున్నారు. ఆయన గత చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి విజయాలు సాధించాయి. నెక్స్ట్ ఆయన అఖండ 2కి సిద్ధం అవుతున్నారు. ఎన్నికల అనంతరం అఖండ 2 పై ప్రకటన ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను వెల్లడించాడు.