Chandrababu’s lawyer fee : ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కాంలో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని.. అందుకు చంద్రబాబును బాధ్యులుగా చేస్తూ సిఐడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. కేసు నుంచి చంద్రబాబు బయట పడే మార్గాలను అన్వేషించింది. ఈ కేసును వాదించే బాధ్యతలను సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూద్రను తెలుగుదేశం నాయకత్వం అప్పగించింది. ఇప్పటికే విజయవాడ ఏసిబి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సిద్ధార్థ్ బలమైన వాదనలు వినిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు దిగ్విజయంగా కోర్టు నుంచి బయటకు వస్తారని టిడిపి శ్రేణులు బలంగా ఆశిస్తున్నాయి.
అయితే ఇప్పుడు లాయర్ సిద్ధార్థ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన దేశంలోనే ప్రముఖ న్యాయవాది. సుప్రీంకోర్టులో పేరున్న న్యాయవాదుల్లో ఈయన ఒకరు. అత్యధిక ఫీజు తీసుకునే న్యాయవాదుల్లో ఈయన ముందుంటారని ప్రచారం జరుగుతోంది. అటువంటి ఖరీదైన లాయర్ ను టిడిపి ఎంపిక చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబును సిఐడి అరెస్టు చేసిన నేపథ్యంలో సిద్ధార్థ్ ను హుటాహుటిన ఢిల్లీ నుంచి అమరావతికి రప్పించినట్లు తెలుస్తోంది. ఈయన ఢిల్లీ కాకుండా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో కేసు వాదించడానికి రోజుకు 1.5 కోట్ల రూపాయలు ఫీజుగా తీసుకుంటారని టాక్ నడుస్తోంది. దీనికి తోడు ఆయనకు స్పెషల్ ఫ్లైట్, లగ్జరీ కారు సమకూర్చాల్సి ఉంటుంది. పేరు మోసిన హోటల్లో బస ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
అయితే సిద్ధార్థ్ సేవలు టిడిపికి కొత్త కాదు. గతంలో కూడా ఆయన సేవలను వినియోగించుకున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో అమరావతి భూములు కేసులను ఆయనే వాదించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుకు సంబంధించి ఏ కేసులైనా సిద్ధార్థ్ చూసుకుంటారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వివేకానంద హత్య కేసులకు సంబంధించి సునీత తరపున సిద్ధార్థ్ వాదనలు వినిపించారు. ఈయన వాదించిన కేసుల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కూడా చంద్రబాబును బయటపడేస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
అయితే చంద్రబాబు తాజా కేసులో వాదిస్తున్న సిద్ధార్థ్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. శనివారం అర్ధరాత్రి నుంచి చంద్రబాబు అరెస్ట్ హై డ్రామా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబుకు 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదన్న ప్రచారం జరిగింది. అటు టిడిపి శ్రేణులు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే సిద్ధార్థ్ ఎంటర్ అయిన తర్వాత పరిస్థితుల్లో మార్పు కనిపించింది. అటు టిడిపి శ్రేణులు సైతం కొంత ఊపిరి పీల్చుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే కోర్టులో సిద్ధార్థ్ లూధ్ర బలమైన వాదనలు వినిపించారు. చంద్రబాబుకు తప్పకుండా బెయిల్ లభిస్తుందని టిడిపి శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి. అయితే అన్నింటికీ మించి ఈ కేసులో చంద్రబాబు తరుపు వాదించిన లాయర్ ఫీజు చర్చనీయాంశంగా మారింది.