Kaliyuga : ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాతో మరో సారి కలియుగం గురించి సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఆ సినిమాలో కమల్ హాసన్ ‘కలి’ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రజల నుంచి ప్రకృతిని హస్తగతం చేసుకుని తన ఆధీనంలో పెట్టుకుని లోకాన్నిశాసిస్తుంటారు. తన వయసుని పెంచుకోవడానికి పొత్తిళ్లలో ఉన్న శిశువు నుంచి సీరమ్ ను సేకరించి ఇంజెక్ట్ చేసుకుని మరణం లేని రాక్షసుడిగా మారడానికి ప్రయత్నిస్తాడు. కలిని అంతం చేసేందుకు ఆ శ్రీ మహా విష్ణువు ‘కల్కి’ అవతారంలో జన్మిస్తాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అయితే, కలి పాలించిన యుగాన్ని కలియుగంగా పరిగణిస్తారు. అసలు యుగాలు ఎన్ని వాటిని ఎలా విభజించారో తెలుసుకుందాం.. వేదాల ప్రకారం, హిందూ మతంలో 4 యుగాలు ఉన్నాయి. అందులో చివరిది కలియుగం. ప్రస్తుతం మనం ఆ యుగంలోనే జీవిస్తున్నాం. కలియుగం ముగియడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయో తెలుసా? కలియుగ ముగింపులో ఎలాంటి సంఘటనలు జరగనున్నాయి..? చూద్దాం..
హిందూ మతం ప్రాచీనమైనది
హిందూ మతం 90 వేల సంవత్సరాల నాటిదని చెబుతారు. క్రీ.పూ.9057లో స్వయంభూ మనువు, క్రీస్తుపూర్వం 6673లో వైవస్వత మనువు హిందూమతంలో మొదటివారు. పురాణాల ప్రకారం, శ్రీరాముని జననం సా.శ.పూ. 5114, శ్రీ కృష్ణుని జన్మ క్రీ.పూ 3112 అని పేర్కొన్నారు. ప్రస్తుత పరిశోధన ప్రకారం.. హిందూ మతం 12-15 వేల సంవత్సరాల పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. ఇది దాదాపు 24 వేల సంవత్సరాల నాటిదని తెలుస్తోంది.
నాలుగు యుగాలు
వేదాల ప్రకారం హిందూ మతంలో సత్యయుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం అనే నాలుగు యుగాలు ప్రస్తావించబడ్డాయి. ఈ సత్యయుగంలో దాదాపు 17 లక్షల 28 వేల సంవత్సరాలు, త్రేతాయుగంలో దాదాపు 12 లక్షల 96 వేల సంవత్సరాలు, ద్వాపర యుగంలో 8 లక్షల 64 వేల సంవత్సరాలు, కలియుగంలో దాదాపు 4 లక్షల 32 వేల సంవత్సరాలు ఉన్నాయని చెబుతారు. ప్రస్తుత కలియుగం శ్రీరాముని త్రేతాయుగం, శ్రీకృష్ణుని ద్వాపర యుగంతో ముడిపడి ఉంది.
కలియుగం మొత్తం వ్యవధి
పండితుల ప్రకారం, కలియుగం 4 లక్షల 32 వేల మానవ సంవత్సరాలుగా విస్తరించి ఉంది. అందులో మనం కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే జీవించాము. కలియుగం ఆధునిక గణనను పరిశీలిస్తే, కలియుగం క్రీస్తుపూర్వం 3,120లో ఐదు గ్రహాలు అంగారకుడు, బుధుడు, శుక్రుడు, గురు, శని మేషరాశిలో 0 డిగ్రీల వద్ద ఉన్నప్పుడు ప్రారంభమైనట్లు చెబుతారు. దీని ప్రకారం ఇప్పటి వరకు కలియుగం 3102+2023=5125 సంవత్సరాలు మాత్రమే గడిచింది. ఈ విధంగా, కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలలో 5,125 సంవత్సరాలు గడిచినట్లయితే, 4,26,875 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. అంటే కలియుగం ముగియడానికి ఇంకా 4,26,875 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ప్రస్తుత కాలాన్ని కలియుగం మొదటి దశ అంటారు.
కలియుగం ఎలా ఉంటుంది?
కలియుగంలో మతం అంతరించిపోవడం, దుష్కర్మలు, దుర్మార్గాలు పెరగడం చూస్తుంటాం. ఈ యుగంలో భూమిపై ఉన్న అన్ని జీవరాశులలో, దేవతలు, రాక్షసులు, యక్షులు లేదా గంధర్వులు కూడా మనిషి కంటే గొప్పవారు కాదు. ఈ యుగంలో మంచి పనులు చేసేవారిని దేవతలుగానూ, చెడు పనులు, పాపాలు చేసేవారిని రాక్షసులుగానూ పరిగణిస్తారు. వేదవ్యాస మహర్షి మహాభారతంలో కలియుగం గురించి ప్రస్తావిస్తూ, ఈ యుగంలో మానవులలో వర్ణాశ్రమ సంబంధిత ధోరణులు ఉండవని, వేదాలను అనుసరించే వారు ఉండరని చెప్పారు. ప్రజలు కూడా వివాహానికి కులం, గోత్రం, మతాన్ని పరిగణించరు. శిష్యుడు గురువు మాట వినడు. కలియుగంలో కాలం గడిచే కొద్దీ భయంకరమైన రోజులు వస్తాయి.
కలియుగంలో విష్ణువు అవతారం
ప్రపంచంలో స్త్రీద్వేషం, దుష్ప్రవర్తన, క్రూరత్వాన్ని అంతం చేయడానికి, ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణువు వివిధ అవతారాలను ధరించాడు. అలా ఆయన సృష్టించినవే దశావతారాలుగా గుర్తింపు పొందాయి. అందులోని పదవ, చివరి అవతారం కల్కి అవతారంగా చెప్పబడింది.
కాలాన్ని ఎలా లెక్కిస్తారంటే?
హిందూ విశ్వాసాల ప్రకారం కాలాన్ని ఆ దేవదేవుడు బ్రహ్మ జీవిత కాలంతో పోలుస్తారు. బ్రహ్మ జీవిత కాలం 100 ఏళ్లు. అంటే మన సమయం ఆ బ్రహ్మదేవుడి సమయం ఒకటి కాదు. మనకు ఏడాది అంటే 365 రోజులు ఉంటాయి. కానీ, బ్రహ్మకు ఒక రోజు అంటే 4.32 బిలియన్ సంవత్సరాలు. దాదాపు మానవుడి నాగరికత 4.32 బిలియన్ సంవత్సరాలు మొత్తం పూర్తయితే బ్రహ్మ దేవుడికి ఒక రోజు ముగిసినట్లు లెక్క. బ్రహ్మ దేవుడి ఒక రోజు కాలం 14 మన్వంతరాలతో సమానం అన్నమాట. ఒక్కో మన్వంతరంలో నాలుగు యుగాలు ఉంటాయి. ఈ లెక్కన కలియుగ కాలం 4కోట్లు 32వేల సంవత్సరాలు. ఈ గడువు పూర్తయితేనే కలియుగం అంతం అయినట్లు అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మ జీవిత కాలం ప్రకారం ప్రస్తుతం మనం 91వ సంవత్సరంలో ఉన్నాం. 28వ మహాయుగంలో 2,448వ కలియుగం నడుస్తోంది. అంటే, ఇప్పటికే 2,447 కలియుగాలు ముగిసిపోయాయి.
కాక్‌భూషుంది రుషి చరిత్ర ప్రకారం.. మహారుషి లోహాస్ శాపం మేరకు కాక్‌భూషుంది.. కాకిగా మారిపోతాడు. రామమంత్రాన్ని జపించిన అనంతరం తనకు శాప విముక్తి కలుగుతుంది. అయితే, శాప విముక్తుడు కావడానికి ఎన్నో యుగాలుపట్టింది. తన జీవిత కాలంలో 11 రామాయణాలు, 16 మహాభారతాలను చూసినట్లు కాక్‌భూషుంది రుషి చరిత్ర చెబుతోంది. అంటే, ప్రతి యుగం మళ్లీ రిపీట్ అవుతుందన్న మాట. ఈ ప్రాతిపదికన కలియుగాన్ని కూడా ఈ రుషి ఎన్నోసార్లు చూసే ఉంటారు. బ్రహ్మ అస్తమించేవరకు ఈ సైకిల్ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. కొత్త మన్వంతరం మొదలవుతూనే ఉంటుంది.