Chandrababu: ఏపీ కోసం కేంద్రాన్ని చంద్రబాబు ఎన్ని కోట్లు అడిగాడో తెలుసా?

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక మినహాయింపు లభిస్తే.. మిగతా రాష్ట్రాలు గగ్గోలు పెట్టే అవకాశం ఉంది. పైగా దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలు అధికం. మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరగనున్నాయి.

Written By: Dharma, Updated On : July 6, 2024 1:12 pm

Chandrababu

Follow us on

Chandrababu: చంద్రబాబు కేంద్రం ముందు కీలక ప్రతిపాదనలు పెట్టారా? దాదాపు లక్ష కోట్లు సాయం అడిగారా? అది కూడా వివిధ ప్రాజెక్టుల రూపంలోనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మూడు రోజులుగా ఢిల్లీలో క్షణం తీరిక లేకుండా గడిపారు చంద్రబాబు. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను వరుసగా కలిశారు. ఏపీకి చెందిన ఎన్డీఏ ఎంపీలను తన వెంట తీసుకెళ్లి మరి వినతి పత్రాలు అందించారు. ఏపీలో ప్రాధాన్యత ప్రాజెక్టులతో పాటు ఆర్థిక లోటు భర్తీ చేసేందుకు దాదాపు లక్ష కోట్ల రూపాయలు సాయం అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి 50వేల కోట్ల రూపాయలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 12,000 కోట్ల రూపాయలు, ఆర్థిక లోటు కోసం మరో ఏడు వేల కోట్ల రూపాయలు తక్షణసాయంగా అందించాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం.

ఈ నెలలో కేంద్రం పూర్తిస్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. అందుకే చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు. ఏపీలో కీలక ప్రాజెక్టులు చేపడుతున్న శాఖలకు సంబంధించిన మంత్రులకు వినతి పత్రాలు అందించారు. మొత్తంగా లక్ష కోట్ల సాయాన్ని చంద్రబాబు అడిగినట్టు జాతీయ మీడియా వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఏపీ విధ్వంసానికి గురైందని.. గాడిన పడాలంటే ఆర్థిక చేయూత అందించాలని.. జిడిపిలో అదనంగా అర శాతం అప్పు తీసుకునే అవకాశాన్ని కల్పించాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత అంశంగా తీసుకున్నట్లు కేంద్ర పెద్దలకు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. తక్షణసాయంగా అమరావతి రాజధాని నిర్మాణానికి 5000 కోట్ల రూపాయలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 1500 కోట్ల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగంగా ఏపీకి కనీసం 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని చంద్రబాబు కోరినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక మినహాయింపు లభిస్తే.. మిగతా రాష్ట్రాలు గగ్గోలు పెట్టే అవకాశం ఉంది. పైగా దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలు అధికం. మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరగనున్నాయి. అందుకే చంద్రబాబు కేంద్ర పెద్దలకు ఇబ్బంది పెట్టకుండా నిధులు అడిగినట్లు సమాచారం. ఏపీకి నగదు బదిలీ చేయాలని ఆయన అడగలేదు. కానీ వ్యూహాత్మకంగా కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టే పథకాల ద్వారా ఏపీకి కేటాయించగలిగే నిధులు గురించి ఆయన ఎక్కువగా విజ్ఞాపన పత్రాలు సమర్పించినట్లు తెలుస్తోంది. ఫలానా పథకానికి దేశవ్యాప్తంగా ఇంత ఖర్చు పెడుతున్నారు.. అందులో ఏపీలో ఈ పథకానికి ఎంత కేటాయించండి అంటూ చంద్రబాబు కోరేసరికి కేంద్ర మంత్రులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం చంద్రబాబు ఏపీకి నిధులు రాబట్టే ప్రయత్నంలోనే ఉన్నారు. అంతకుమించి ఏమీ ఆలోచన చేయడం లేదు. తమకు కేంద్రం నుంచి రాజకీయ పదవులు అక్కర్లేదని కూడా తేల్చి చెప్పారు. కేవలం ఏపీ ప్రయోజనాలకు సహకరిస్తే చాలని రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అటు కేంద్రం సైతం మారిన చంద్రబాబు స్వరాన్ని గుర్తిస్తోంది. గతంలోల ఏపీ గురించి నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిస్థితి కేంద్రానికి లేదు. అంత సీన్ కూడా అక్కడ కనిపించడం లేదు. మారిన రాజకీయ అవసరాలతో ప్రధాని సైతం ఏపీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అందుకే చంద్రబాబు అడిగినంత కాకపోయినా ఈసారి బడ్జెట్లో పోలవరం, అమరావతికి నిధులు కేటాయించే అవకాశం ఉంది. అదనంగా అప్పులు చేసుకునేందుకు వెసులుబాటు కూడా కల్పించినట్లు తెలుస్తోంది.