Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) ఎన్నో సంచలనాలకు వేదిక అవుతున్నారు. ఆయనపై వరుసగా న్యాయస్థానాలకు ఫిర్యాదు చేస్తున్నారు కొందరు. ఏపీ డిప్యూటీ సీఎం తో పాటు మంత్రిగా ఉంటూ సినిమాల్లో నటించడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాజీ ఐఏఎస్ అధికారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ కొనసాగుతుండగా తాజాగా మరో పిటిషన్ హైకోర్టులో దాఖలయ్యింది. ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడం విశేషం. ఓ రైల్వే విశ్రాంత ఉద్యోగి కొండలరావు ఈ పిల్ దాఖలు చేశారు.
Also Read: సుమన్ శెట్టి మౌనానికి కారణం ఏంటి..? ఇలా ఐతే కష్టమేనా.?
* పవన్ కళ్యాణ్ కు గౌరవం దక్కాలని..
ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. 2019లో గెలిచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో అప్పటి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడింది. అప్పటి మాజీ సీఎం చంద్రబాబుపై వరుసగా కేసులు నమోదు చేశారు. టిడిపి రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న క్రమంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్. వైసీపీని ఎదుర్కోవడం ఒక్క తెలుగుదేశం పార్టీ పని కాదని చెప్పి ఆ పార్టీతో నేరుగా పొత్తు ప్రకటన చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని సైతం ఒప్పించి కూటమిలోకి తేవడంలో పవన్ పాత్ర కీలకంగా మారింది. సీట్ల సర్దుబాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవుల సర్దుబాటు వంటి విషయంలో పవన్ తనదైన పాత్ర పోషించారు. అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఆయన కోరుకున్న నాలుగు మంత్రిత్వ పదవులను కేటాయించారు. తనతో పాటు పవన్ కళ్యాణ్ కు గౌరవం దక్కాలని భావించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తనతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో సైతం ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు.
* గతంలో సీఎం ఫోటో మాత్రమే..
అయితే గతంలో కేవలం ముఖ్యమంత్రి( chief minister) ఫోటో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండేది. హోదా వరకు డిప్యూటీ సీఎం కానీ.. ఆ పదవికి ప్రత్యేక అధికారాలు ఉండవు. ప్రత్యేక గుర్తింపు కూడా ఉండదు. అటువంటిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇది జరిగి 15 నెలలు అవుతున్న తరువాత ఓ విశ్రాంత ఉద్యోగి దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిత్రపటాల ప్రదర్శన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం తీసుకొచ్చేవరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ ఫోటో తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. మరి కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.