Sajjala Ramakrishna Reddy: వైసిపి ఓటమి తర్వాత అందరి వేళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి వైపు చూపించాయి. ఆయన తీరుతోనే పార్టీ ఓడిపోయిందన్నది ఎక్కువ మంది నేతల అభిప్రాయం. ఒకరిద్దరూ బాహటంగానే వ్యాఖ్యానించారు. సజ్జల విషయంలో ప్రాధాన్యత తగ్గించాలని కూడా కోరారు. అయితే జగన్ విన్నట్టు వింటూనే.. సజ్జల విషయంలో మరో మాటకు తావు లేకుండా వ్యవహరించారు.రాష్ట్రంలో ఆరుగురు నేతలకు ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమించిన జగన్.. సజ్జలను ఏకంగా ప్రమోట్ చేశారు.రాష్ట్ర సమన్వయ బాధ్యతలను అప్పగించారు.తన తరువాత పార్టీలో సజ్జల అన్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఈ విషయంలో మరో అంశానికి తావు లేదని తేల్చి చెప్పారు.అయితే ఈ నిర్ణయాన్ని కడప జిల్లా నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు.పార్టీకి ఈ పరిస్థితి రావడానికి సజ్జల కారణమని జగన్ ముఖం మీద చెప్పడం సంచలనం గా మారింది.ప్రస్తుతం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు జగన్. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపించిన మాట సజ్జల. సజ్జల వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని చాలామంది నేతలు అధినేత వద్ద ఆవేదన వ్యక్తం చేయడం విశేషం.
* ఐదేళ్ల పాటు అవమానం
గత ఐదేళ్లుగా పార్టీతోపాటు సీఎంవోను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించడం ఏంటని మెజారిటీ నేతలు నిలదీసినంత పనిచేశారు.తమకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని.. ఐదేళ్లపాటు పార్టీ ప్రధాన కార్యాలయానికి రానివ్వలేదని చాలామంది నేతలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా రాజకీయాల్లో కూడా సజ్జల ప్రవేశించారని..షాడో నాయకుల ద్వారా చక్రం తిప్పుతున్నారని చెప్పుకొచ్చారు. తమ పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడిలా తయారైందని వారు పేర్కొన్నారు. అయితే అన్ని సర్దుకుంటాయని..తాను ఉన్నానంటూ జగన్ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.కానీ మెజారిటీ నాయకులు మాత్రం వినిపించుకోలేదు. తమకు విలువ లేకుండా చేసిన సజ్జలకే ఇంకా ప్రాధాన్యం ఏంటని ఒక మాజీ ఎమ్మెల్యే నిలదీసినంత పని చేసినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ నేతల నుంచి సజ్జలపై దాడి తీవ్రం కావడంతో జగన్ అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
* విభేదాలకు ఆయనే కారణమా
అయితే కడప జిల్లాలో సజ్జల ప్రవేశించడం పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఓ నేత అయితే తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. ఒక వార్డు నుంచి కూడా విజయం దక్కించుకొని ఓ నాయకుడి వెనుక సజ్జల ఉన్నారని… కానీ తన తండ్రి హయాం నుంచి నియోజకవర్గంలో విజయం దక్కించుకుంటూ వస్తున్నానని.. అలాంటిది తనకే విలువ లేకుండా పోయిందని ఆ నేత ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అటు జిల్లాకు చెందిన మేయర్ సైతం సజ్జలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మీకోసం పార్టీని బలోపేతం చేస్తాం కానీ.. సజ్జలను మాత్రం పార్టీ నుంచి తప్పించాలని నేరుగా కోరేసరికి జగన్ సతమతమైనట్లు సమాచారం.తనకు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుస్తున్నాయని.. త్వరలోనే మార్పులు చేస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారు. మొత్తానికి అయితే కడప జిల్లా నేతలకు సజ్జల టార్గెట్ కావడం విశేషం. అయితే ఈ సమస్యను జగన్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.