Chandrababu Vs Jagan Governance: ఏపీలో( Andhra Pradesh) టీడీపీ కూటమి పాలన 14 నెలలు పూర్తి చేసుకుంది. గత ఏడాది జూన్ 12న అధికారం చేపట్టింది టిడిపి కూటమి. సూపర్ సిక్స్ పథకాలు ఒకవైపు, అమరావతి రాజధాని ఇంకో వైపు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరోవైపు.. ఇలా ఎన్నెన్నో హామీలు, ప్రజల ఆకాంక్షలు, కొంగొత్త ఆశలతో అధికారంలోకి వచ్చింది టిడిపి కూటమి ప్రభుత్వం. చంద్రబాబు అనూహ్యంగా తన క్యాబినెట్లో కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన పదిమందిని తీసుకున్నారు. జూనియర్, సీనియర్ల మేళవింపుగా క్యాబినెట్ కూర్పు చేశారు. తొలి మూడు నెలలు పాలనాపరమైన విధానాల్లో నిమగ్నమైంది ప్రభుత్వం. ముఖ్యంగా అధికారం చేపట్టేసరికి రాష్ట్రంలో రహదారుల అస్తవ్యస్తంగా ఉండేవి. ఇతరత్రా మౌలిక వసతుల విషయంలో కూడా ఇబ్బందులు ఉండేవి. వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా గుంతల రహదారులను పూడ్చే విధంగా చర్యలు చేపట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని మూడు వేల నుంచి 4 వేల రూపాయలకు పెంచింది. మూడు నెలల బకాయితో అందించింది.
Also Read: అప్పుడు కడపలో ఉమేష్ చంద్ర.. ఇప్పుడు పులివెందులలో కోయా ప్రవీణ్!
కూటమి ప్రభుత్వం చేసిన తొలి పని అదే. అదే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని మూడు వేల రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారు. కానీ అమలు చేయలేకపోయారు. ఏడాదికి 250 రూపాయలు పెంచుతూ.. ఎన్నికల సమయానికి మూడు వేలకు పెంచి చూపించారు.* చంద్రబాబు( CM Chandrababu) అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఫైల్ గా.. డీఎస్సీ నియామక ఫైల్ పై సంతకం చేశారు. దాదాపు 16 వేల నాలుగు వందల ఉపాధ్యాయ పోస్టులను బత్తి చేస్తామని ప్రకటించారు. చెప్పిన మాదిరిగానే ఏడాది కాలంలోనే డీఎస్సీ నియామకం పూర్తి చేశారు. కొద్ది రోజుల్లో ఉపాధ్యాయ నియామకాలు పూర్తి కానున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి ఏటా డీఎస్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. కానీ నాలుగేళ్ల పాలనలో దాని గురించి పట్టించుకోలేదు. 2024 ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ప్రక్రియ ప్రారంభం కాకుండానే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అది రద్దయింది.
* 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లను రద్దు చేశారు. పేదలకు మూడు పూటల 15 రూపాయలతో పట్టణ, నగర ప్రాంతాల్లో ఆహారం అందేది. కానీ దానిని రద్దు చేశారు జగన్. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 200 అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం అయ్యాయి.
* జగన్మోహన్ రెడ్డి పేదల ఇంట్లో పిల్లల చదువుకు 15వేల రూపాయల చొప్పున అందిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారు. కానీ ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వం సైతం ఇదే తరహా హామీ ఇచ్చింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అమలు చేసింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి సాయం అందజేసింది.
* గత ఏడాది దీపావళి నాడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసింది కూటమి ప్రభుత్వం. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ఎన్నికల్లో చెప్పుకొచ్చింది. దానిని అమలు చేసి చూపించింది.
* పల్లె పండుగ పేరిట గ్రామాల స్వరూపాన్ని మార్చింది కూటమి ప్రభుత్వం. దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలతో మౌలిక వసతులను కల్పించింది. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేసిందన్న విమర్శముండేది. దానిని సరిచేసింది కూటమి ప్రభుత్వం.
* అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వస్తే ఏడాదికి కేంద్రంతో కలిపి ప్రతి రైతుకు 20వేల రూపాయల సాయం అందిస్తామని సూపర్ సిక్స్ లో ప్రకటించారు చంద్రబాబు. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత.. ఈ పథకం అమలును ప్రారంభించారు. పీఎం కిసాన్ 2000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 5000 అందించారు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రం అందించే పీఎం కిసాన్ తో పాటు రూ.7500 మాత్రమే అందించేది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ.14000 అందించేందుకు సిద్ధపడింది.
Also Read: మహిళలతో కలిసి బస్సులో బాబు, పవన్.. ఈ అరుదైన వీడియో చూడాల్సిందే
* ఆగస్టు 15న మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో దాదాపు సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైనవి అమలైనట్టే. మహిళలకు సంబంధించిన నెలకు 1500 రూపాయల సాయం అందిస్తానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఈ పథకం మాత్రమే అమలు చేయాల్సి ఉంది.
* సంక్షేమం ఆలస్యంగా ప్రారంభించినా..
వైసిపి ప్రభుత్వంతో పోల్చుకుంటే సంక్షేమం విషయంలో మాత్రం చంద్రబాబు సర్కార్ ఆలస్యంగా ప్రారంభించింది. తొలి ఏడాది అమరావతి రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణ, పోలవరం నిర్మాణం, పాలనను గాడిలో పెట్టడం, రాజ్యాంగ వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి వాటిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిచ్చింది. అయితే అభివృద్ధితోపాటు సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం సంక్షేమం పైనే దృష్టి పెట్టింది. అభివృద్ధిని విస్మరించింది. దానిని గుర్తించిన చంద్రబాబు సర్కార్ అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోంది. అవి సత్ఫలితాలు ఇచ్చినట్టు కనిపిస్తున్నాయి కూడా.