Dharmana Prasada Rao: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao). సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు ధర్మాన. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో మరింత రాటు దేలారు. 1989లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి అయ్యారు. అయితే 2014 వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అనుకోని స్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయితే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించారు. కానీ తరువాత అదే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కింద పని చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తారన్న ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే గత ఏడాది కాలంగా మౌనంగా ఉండి పోయారు. వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కానీ ఇటీవల క్రియాశీలకం అయ్యారు. అయితే అదంతా కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసమే అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధర్మాన ప్రసాదరావు కు కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు సమాచారం. అయితే మొన్నటికి మొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేసిన తరువాత ధర్మాన ప్రసాదరావుకు అదనపు బాధ్యతలు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుండడం విశేషం.
* దువ్వాడ శత ప్రయత్నాలు..
ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ) ధర్మాన బ్రదర్స్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కింజరాపు కుటుంబంతో కలిసి పార్టీని నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. తాను ప్రతిసారి ఓడిపోవడం వెనుక ఆ రెండు కుటుంబాలు ఉన్నాయన్నది దువ్వాడ శ్రీనివాస్ అభియోగం. జగన్మోహన్ రెడ్డికి విన్నవిస్తూ ధర్మాన బ్రదర్స్ ను నమ్మవద్దని కోరారు దువ్వాడ. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే ధర్మాన ప్రసాదరావుకు కీలక బాధ్యతలు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అదే జరిగితే దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ లైఫ్ పూర్తిగా కనుమరుగైనట్టే. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు. వారిని కాదనుకొని దువ్వాడ శ్రీనివాస్ లాంటి నేతను పార్టీలోకి తీసుకోవడం జగన్ తరం కాదు. పైగా దువ్వాడ శ్రీనివాస్ వల్ల వివాదాలు పెరుగుతున్నాయి అన్న ఫిర్యాదులు ఉన్నాయి.
* కుమారుడి పొలిటికల్ లైఫ్ కోసం..
ధర్మాన ప్రసాదరావు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కు( Ram Manohar Naidu ) పొలిటికల్ లైఫ్ ఇవ్వాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. అలాగే తాడేపల్లి కేంద్ర కార్యాలయం బాధ్యతలను ధర్మాన ప్రసాదరావుకు అప్పగించనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి లాంటి నేతలను నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు ఉండనుంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పటినుంచి పార్టీ బలోపేతం ఆవశ్యం. కానీ ఇప్పటివరకు నమ్ముకున్న నేతలను పక్కన పెట్టి ధర్మాన లాంటి సీనియర్ సేవలను వినియోగించుకోవాలన్నది జగన్ వ్యూహం. అయితే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ఫ్యామిలీ హవాను తగ్గించి.. సామాజిక వర్గపరంగా ముందుకు వెళ్లాలని దువ్వాడ శ్రీనివాస్ అనుకున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా ధర్మాన ప్రసాదరావుకు ప్రమోషన్ కల్పించారు. కీలకమైన తాడేపల్లి కేంద్ర కార్యాలయ బాధ్యతలను అప్పగించనున్నట్లు సమాచారం. అదే జరిగితే దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ జీవితానికి ఒక ఫుల్ స్టాప్ పడినట్టే. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని మెప్పించి వైసీపీలో చేరాలని దువ్వాడ శ్రీనివాస్ అనుకున్నారు. కానీ అది జరిగే పని కాదని ధర్మాన ప్రమోషన్ ద్వారా తేలిపోయింది.