Dharmana Prasada Rao: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీలో కొంతమంది నాయకులు ఇటీవల యాక్టివ్ అయ్యారు. ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది ఆందోళనకు గురయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే కూటమి పార్టీలో అవకాశాలు లేని వారు సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు వారంతా క్రియాశీలకం కావాల్సిన అనివార్య పరిస్థితులు ఎదురయ్యాయి. యాక్టివ్ అవుతారా? మీ స్థానంలో కొత్త వారిని నియమించాలా? అనేసరికి చాలామంది నేతలు యాక్టివ్ అవుతున్నారు. మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన యాక్టివ్ కావడం జరిగింది. ప్రస్తుతం ఆయన కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ధర్మాన.. అకస్మాత్తుగా మాట్లాడడం వెనుక దువ్వాడ శ్రీనివాస్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. తాను మౌనంగా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డికి మరింత దగ్గరగా మారి పార్టీలో కీలక నాయకుడుగా ఎదుగుతారన్న బెంగతోనే ధర్మాన వైసీపీలో యాక్టివ్ అయినట్లు ప్రచారం నడుస్తోంది.
* సీనియర్ లీడర్.
ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao) సీనియర్ మోస్ట్ లీడర్. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో మరింతగా ఎదిగారు. 1989 లోనే తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి అయ్యారు. 2004 నుంచి 2014 వరకు సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. 2019లో వైసీపీ తరఫున రెండేళ్లు మంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్ రాజకీయాలు ఆయనకు ఎనలేని ఆసక్తి. తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేశారే తప్ప.. జగన్మోహన్ రెడ్డి విషయంలో అంతగా సానుకూల దృక్పథంతో ఉండేవారు కాదు. అయితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన సైలెంట్ గా ఉంటే ప్రత్యర్థి వర్గం బలపడడం ఖాయం. అందుకే ధర్మాన ప్రసాదరావు యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది.
* దువ్వాడ సంచలన ఆరోపణలు..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై( duvvada Srinivas ) వైసీపీ హై కమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన కుటుంబ కారణాల రీత్యా ఆయనపై వేటు పడింది. అయితే తనపై సస్పెన్షన్ వెనుక ధర్మాన సోదరుల హస్తం ఉందని.. కింజరాపు కుటుంబంతో ఒప్పందంమని.. మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే జిల్లా రాజకీయాలు వారి కుటుంబాల కనుసన్నల్లో నడుస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఆ రెండు కుటుంబాలు కలిపి జిల్లాలో ఇతర సామాజిక వర్గాలను తొక్కి పెడుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు దువ్వాడ శ్రీనివాస్. ప్రధానంగా ధర్మాన ప్రసాదరావు పైనే విరుచుకుపడ్డారు. మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని.. జగన్మోహన్ రెడ్డిని దేవుడితో పోల్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారన్న అనుమానం ధర్మాన ప్రసాదరావు లో పెరిగింది. మరోవైపు కూటమి పార్టీలో చేరే పరిస్థితి లేదు. ఇంకా కుమారుడు రాజకీయ భవిష్యత్తు సెట్ కాలేదు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మొత్తానికైతే దువ్వాడ హెచ్చరికలు ధర్మాన ప్రసాదరావు పై బాగానే పనిచేశాయి.