Duvvada Srinivas: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్. వ్యక్తిగత కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆయన సస్పెన్షన్ జరిగింది. అయితే తనను కుట్రపూరితంగా ధర్మాన సోదరులు పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్నారు దువ్వాడ. తనకు జగన్ అంటే ప్రాణమని.. ఎంతో గౌరవం అని చెప్పుకొస్తున్నారు. అయితే మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తానని నమ్మకంగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబంతో పాటు కింజరాపు కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదు నుంచి వస్తున్న దువ్వాడ శ్రీనివాస్ పై నిమ్మాడ జంక్షన్ లో దాడి చేస్తారన్న వార్తలు హల్చల్ చేశాయి. గతంలో కింజరాపు సొంత గ్రామానికి చెందిన కింజరాపు అప్పన్న దివ్వెల మాధురి తో చెప్పిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. నిమ్మడ జంక్షన్లో దువ్వాడ శ్రీనివాస్ పై దాడికి ప్రయత్నిస్తున్నారని.. ఇందులో ధర్మాన కృష్ణ దాస్ అనుచరులతో పాటు కింజరాపు ఫ్యామిలీ సొంత గ్రామమైన నిమ్మాడలో దీనిపై చర్చిస్తున్నారని అప్పన్న దివ్వెల మాధురికి ఫోన్లో చెప్పిన విషయం లీక్ అయింది. ఇంతలో దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ జంక్షన్ వద్దకు చేరుకొని హల్చల్ చేశారు. నాపై దాడి చేయండి అంటూ సవాల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
* కేవలం సస్పెన్షన్ వేటు..
అయితే శ్రీకాకుళంలో దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ) వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఆయనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం సస్పెన్షన్ వేటు మాత్రమే వేసింది. ఇంతవరకు బహిష్కరించలేదు. ఆయన చూస్తే ధర్మాన కుటుంబం పై విరుచుకుపడుతున్నారు. ధర్మాన కుటుంబం లేనిదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో రాజకీయం చేయలేదు. పైగా దువ్వాడ శ్రీనివాస్ వెంట మెజారిటీ క్యాడర్ అంటూ లేదు. ఆయన వైఖరితో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని నమ్మిన వారే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయం బట్టి జిల్లాలో ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుందనడంలో అతిశయోక్తి కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణ దాస్ ఉన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పెద్దదిక్కుగా ఉన్నారు. వారిద్దరినీ సవాల్ చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. కానీ దువ్వాడ శ్రీనివాస్ ను బహిష్కరించలేకపోతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం ఆయన వద్ద ఉన్న ఎమ్మెల్సీ పదవి. ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరిస్తే దువ్వాడ శ్రీనివాస్ మరింత స్వతంత్రుడు అవుతారు. ఆ మరు క్షణం పార్టీతో పాటు అధినేతను విమర్శిస్తారు. అందుకే వేటు వేయడం లేదని తెలుస్తోంది.
* గతంలో నిమ్మాడ వెళ్లి సవాల్
ఇదే దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడలో( nimbada) కెళ్ళి కింజరాపు కుటుంబానికి సవాల్ చేశారు. గతంలో పంచాయితీ ఎన్నికల సమయంలో ఆ గ్రామానికి వెళ్లి రచ్చ చేశారు. చాలామంది మనుషులను తీసుకెళ్లి వాహనంపై కూర్చుని తొడగొట్టారు. అప్పట్లో కింజరాపు అప్పన్న అనే వ్యక్తిని అచ్చం నాయుడు సమీప బంధువుపై నిలబెట్టారు సర్పంచ్ అభ్యర్థిగా. కానీ కనీస స్థాయిలో కూడా ఆయనకు ఓట్లు రాలేదు. అప్పట్లో నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచులను గెలిచింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ దువ్వాడ శ్రీనివాస్ రచ్చ చేసిన నిమ్మాడలో మాత్రం ఓడిపోయింది. ఇప్పుడు మరోసారి అదే నిమ్మాడ జంక్షన్ లో హల్చల్ చేశారు దువ్వాడ శ్రీనివాస్. కేడి బ్రదర్స్ రండి అంటూ సవాల్ చేశారు. కే అంటే కింజరాపు.. డి అంటే ధర్మాన బ్రదర్స్ అనేది దువ్వాడ శ్రీనివాస్ అభిప్రాయం. అయితే ఎంత చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ధర్మాన బ్రదర్స్ ఫెయిల్ అవుతున్నారు.పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించలేకపోతున్నారు. తెర వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ టిడిపి కంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే తలవంపులు తెస్తున్నారు. ఆ పార్టీలో చీలిక తెస్తున్నారు. ఎంత మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తే ఆ పార్టీకి నష్టం తప్పదు. ఈ విషయంలో ధర్మాన సోదరులు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.