YS Jagan : శ్రీకాకుళం ఎంపీగా ధర్మాన..ఆ రెండు కుటుంబాలపై జ‘గన్’

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా ధర్మాన, కింజరాపు కుటుంబాలు పేరుమోసినవి. రాజకీయంగా శాసిస్తున్నాయి కూడా. కానీ వీరు ముఖాముఖి తలపడిన సందర్భాలు లేవు. పైగా పరస్పర రాజకీయ సహకారం అందించుకుంటాయని ప్రచారంలో ఉంది.

Written By: Dharma, Updated On : June 21, 2023 3:34 pm
Follow us on

YS Jagan : శ్రీకాకుళం ఎంపీ స్థానంపై వైసీపీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కృతనిశ్చయంతో ఉంది. గత రెండు ఎన్నికల్లో ఈ లోక్ సభ స్థానం వైసీపీకి చిక్కలేదు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22 ఎంపీ స్థానాలను ఛేజిక్కించుకున్నాశ్రీకాకుళం మాత్రం పట్టుదక్కలేదు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు స్ట్రాంగ్ గా మారారు. బలమైన అభ్యర్థిని దించితే కానీ ఆయన్న తెగ్గొట్టడం కష్టమని జగన్ కు సైతం నివేదికలు అందాయట. అందుకే ఇక్కడ సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావును వైసీపీ అభ్యర్థిగా జగన్ డిసైడ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ధర్మాన అయితే మంచి అభ్యర్థి అవుతారని…ఫైట్ భీకరంగా ఉంటుందని హైకమాండ్ భావిస్తోందట.

గత ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన ధర్మాన తక్కువ మెజార్టీతో గట్టెక్కారు. జగన్ ప్రభంజనంలో అందరికీ పది వేల మెజార్టీలు దాటినా.. ధర్మాన మాత్రం కేవలం నాలుగు వేల ఓట్లతో గెలుపొందారు. అది కూడా కింజరాపు కుటుంబం లోపయికారీ సాయంతోనే అన్న టాక్ నడిచింది. అటు ఎంపీగా పోటీచేసిన వైసీపీ అభ్యర్థి దువ్వాడ తన ఓటమికి ధర్మాన ప్రసాదరావే కారణమంటూ హైకమాండ్ కు ఫిర్యాదుచేశారు. దాని కారణంగానే ధర్మాన ప్రసాదరావుకు తొలి కేబినెట్ లో చోటు దక్కలేదని ప్రచారం నడిచింది. అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పట్టున్న నాయకుడిగా ధర్మాన ఉండడంతో ఇబ్బందులు తప్పవని గ్రహించిన జగన్ మలి విడతలో ప్రసాదరావుకు కేబినెట్ లో చాన్సిచ్చారు.

రాజకీయాల నుంచి తప్పుకోవాలని ధర్మాన ప్రసాదరావు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనయుడు రామ్ మనోహర్ నాయుడుకు ఎమ్మెల్యే చేయాలని భావిస్తున్నారు. అయితే ఇక్కడే జగన్ ఒక మెలిక పెట్టినట్టు సమాచారం. కుమారుడికి టిక్కెట్ కావాలంటే.. మీరు ఎంపీగా పోటీచేయాలని ప్రసాదరావుకు సూచించినట్టు తెలుస్తోంది. అయితే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని చూస్తున్నట్టు ఆయన చెప్పినట్టు సమాచారం. కానీ జిల్లాలో ఎక్కువ కాలం మంత్రి పదవి చేపట్టిన నాయకుడిగా ఉన్న ప్రసాదరావు ఎంపీ క్యాండిడేట్ అయితే గెలుపు అవకాశాలు పుష్కలమని జగన్ భావిస్తున్నారు. కానీ ధర్మాన మాత్రం మౌనం వహించినట్టు తెలుస్తోంది.

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా ధర్మాన, కింజరాపు కుటుంబాలు పేరుమోసినవి. రాజకీయంగా శాసిస్తున్నాయి కూడా. కానీ వీరు ముఖాముఖి తలపడిన సందర్భాలు లేవు. పైగా పరస్పర రాజకీయ సహకారం అందించుకుంటాయని ప్రచారంలో ఉంది. ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో మంచి సంబంధాలు ఉంటాయని జిల్లాలో టాక్. అందుకే జగన్ ఆ రెండు కుటుంబాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఎలాగైనా మంత్రి ధర్మానను ఎంపీగా పోటీచేయించాలని చూస్తున్నారు. అయితే సీఎం ఆదేశాలను సీనియర్ మంత్రి ధర్మాన పాటిస్తారో? లేదో? చూడాలి మరీ.