Devineni Uma Maheshwar Rao : ఏపీలో( Andhra Pradesh) పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభకు చాలామంది నేతలను పంపించారు. రెండు రోజుల కిందట పెద్ద ఎత్తున కార్పొరేషన్ చైర్మన్ లను ప్రకటించారు. ముఖ్యంగా పార్టీ టిక్కెట్లు త్యాగం చేసిన నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు లేకపోవడం ఇప్పుడు ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. తమ నాయకుడికి కనీసం గుర్తింపు లేకపోవడంపై అనుచరులు చాలా బాధపడుతున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో సీటు త్యాగం చేస్తే.. కనీసం హై కమాండ్ గుర్తించలేదన్న ఆవేదన దేవినేని ఉమామహేశ్వరరావు లో ఉంది. ఇతర నాయకులు మాదిరిగా పార్టీలను మార్చే సంస్కృతి ఉమామహేశ్వరరావు ది కాదు. పార్టీ అధినేతతో పాటు యువ నేత నారా లోకేష్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ దేవినేని ఉమామహేశ్వరరావుకు పదవి దక్కకపోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఇవేవీ పట్టించుకోకుండా దేవినేని ఉమామహేశ్వరరావు తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
Also Read : ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రోటోకాల్.. ఏపీ ప్రభుత్వ సంచలన ఆదేశాలు!
* నాలుగు సార్లు వరుస విజయం..
తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) కరుడుగట్టిన నేతగా దేవినేని ఉమామహేశ్వరరావు కు పేరు ఉంది. ఆయన సోదరుడు దేవినేని వెంకటరమణ టిడిపి ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే రైలు ప్రమాదంలో చనిపోయారు. ఆయన సోదరిగా 1999లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు దేవుని ఉమామహేశ్వరరావు. తొలిసారిగా నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2004లో సైతం ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2009 నియోజకవర్గాల పునర్విభజనతో నందిగామ ఎస్సీలకు రిజర్వ్ చేశారు. దీంతో దేవినేని ఉమ 2009లో మైలవరం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచిన ఉమా 2014లో సైతం విజయం సాధించారు. చంద్రబాబు క్యాబినెట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయనకు సీటు దక్కలేదు. మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలోకి రావడంతో ఆయన కోసం ఉమాను ఒప్పించారు చంద్రబాబు. కృష్ణ ప్రసాద్ గెలుపు కోసం ఉమా పనిచేశారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న దేవినేని ఉమా కు సరైన గుర్తింపు లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
* గుర్తింపు కలిగిన నేత..
ఇటీవల దేవినేని ఉమామహేశ్వరరావు( Devi neni Uma Maheshwar Rao ) కుమారుడు వివాహం జరిగింది. ఆ వివాహానికి చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. కానీ అదే రోజు సింహాచలం ఘటన జరగడంతో వివాహానికి వెళ్తే విమర్శలు వస్తాయని భావించారు చంద్రబాబు. అందుకే ఆ వివాహానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం వాయిస్ బలంగా వినిపించడంలో ముందుండే వారు ఉమామహేశ్వరరావు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు నామినేటెడ్ పదవులు దక్కలేదు. ముఖ్యంగా ఆయనకు కుల సమీకరణ అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.
* స్పష్టమైన హామీ ఉందా..
దేవినేని ఉమామహేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున ఎమ్మెల్సీల భర్తీ ఉంటుంది. ఆ సమయంలో దేవినేని ఉమాను పెద్దల సభకు పంపిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు స్పష్టమైన హామీ ఉందని కూడా సమాచారం. అందుకే అనుచరులు, అభిమానులు ఆందోళనకు గురవుతున్నా.. ఆయన మాత్రం చాలా కూల్ గా కనిపిస్తున్నారు. మరి మున్ముందు చంద్రబాబు ఎలాంటి పదవులు ఇస్తారో.. దేవినేని ఉమా పొలిటికల్ లైఫ్ కు ఎలాంటి భవిత చూపిస్తారో చూడాలి.
Also Read : చెరువుల్లో మట్టి పొలాలకు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు!