Amaravati: అమరావతి రాజధాని( Amaravathi capital ) ప్రాంతంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఒకవైపు రాజధాని నిర్మాణ పనులు జరుగుతుండగా.. పలు సంస్థలు, బ్యాంకు ప్రధాన కార్యాలయాలు, పేరు మోసిన హోటళ్లు నిర్మాణాలు ప్రారంభించాయి. ఇటీవల బాలకృష్ణ ఆధ్వర్యంలోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ కూడా చేశారు. వరుణ్ గ్రూప్ ఒక స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్కు కూడా శంకుస్థాపన చేసింది. తాజాగా మంజీరా హోటల్ సెండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ‘హాలిడే ఇన్’ పేరుతో నాలుగు స్టార్ హోటల్స్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసింది. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ యోగానంద్ దంపతులు సిఆర్డిఏ కార్యాలయం సమీపంలో ఈ హోటల్కు శంకుస్థాపన చేశారు.
* మంజీరా హోటల్ సైతం..
ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతిష్టాత్మకంగా పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు తమకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు ప్రారంభించాయి. ఒకవైపు రాజధాని నిర్మాణానికి సమాంతరంగా వీటి నిర్మాణ పనులు జరిపించేందుకు సిఆర్డిఏ అన్ని రకాల చర్యలు చేపట్టింది. ప్రధానంగా మంజీరా గ్రూపునకు చెందిన హోటళ్లు అమరావతిలో ఏర్పాటు కానుండడం మాత్రం శుభపరిణామం. ఇప్పటికే హైదరాబాద్, రాజమండ్రిలో ఈ హోటళ్లు నడుస్తున్నాయి. అమరావతిలో హాలిడే ఇన్ పేరిట నిర్మిస్తున్న ఈ హోటల్ కు రూ.275 కోట్లు కానుందని ఒక అంచనా. సిఆర్డిఏ దీని నిర్మాణానికి రెండు ఎకరాల భూమిని కేటాయించింది. ఈ కొత్త హోటల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు మంజూరు చేసింది. మొదటి దశలో 150 గదులను అందుబాటులోకి తెస్తామని చైర్మన్ యోగానంద్ తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు పై ఉన్న నమ్మకంతోనే హాలిడే ఇన్ పేరిట హోటల్స్ నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు.
* ఒకేసారి 12 బ్యాంక్ కార్యాలయాలకు..
మరోవైపు రాజధాని అమరావతిలో ఒకేరోజు 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Central finance minister Nirmala sitaraman ) ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఒకేసారి 12 బ్యాంకుల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపనకు ఆర్థిక పనులు రాజధానిలో వేగవంతం అవుతాయని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు అవుతోంది. కానీ ఏపీలో బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు లేవు. విజయవాడలో ప్రాంతీయ కార్యాలయాలు నడుస్తున్నాయి. అందుకే ఇప్పుడు అమరావతి కేంద్రంగా పనిచేసే ప్రధాన బ్యాంకు కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నాయి. త్వరలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో పనులు ప్రారంభించేందుకు బ్యాంకర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికైతే అమరావతిలో కొత్త నిర్మాణాలు కొత్త శోభను తీసుకొస్తున్నాయి. మున్ముందు మరిన్ని నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.