వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. అందుకు సంబంధించి ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పేరుతో ఒక ఘాట్ వెలుగు చూసింది. సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. తక్షణం తొలగించాలని ఆదేశించారు. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఆ బోర్డును తొలగించారు. అయితే దేవాన్ష్ పేరుతో ఉన్న బోర్డుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బోర్డు ఇటీవల ఏర్పాటు చేసింది కాదని… 2015 గోదావరి పుష్కరాల సమయంలోనే ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
* సీతానగరం మండలంలో..
గోదావరి తీరంలో వందలాది ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు ఈసారి. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముని కూడలిలో ఒక పుష్కర ఘాట్ ఉంది. ఇది దేవాన్ష్ ఘాట్ పేరుతో ఉంది. అయితే ఇప్పటి బోర్డు కాదు అని.. పాత బోర్డు అని చెబుతున్నారు అధికారులు. 2015 లో గోదావరి పుష్కరాలు నిర్వహించిన సమయంలో.. అప్పటి రాజానగరం టిడిపి ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఈ ఘాట్ కు దేవాన్ష్ పేరు పెట్టి ఏర్పాటు చేశారు బోర్డు.. నారా లోకేష్, బ్రాహ్మణిలకు 2015 మార్చి 21న జన్మించారు దేవాన్ష్. గోదావరి పుష్కరాలు 2015 జూలై 14 నుంచి 25 వరకు జరిగాయి. అయితే 2015లోనే ఈ బోర్డు ఉందని.. ఇప్పుడు ఏర్పాటు చేసింది కాదు అని అధికారులు తేల్చి చెబుతున్నారు.
* సుదీర్ఘ చరిత్ర..
ఈ పుష్కర ఘాట్ కు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1979 పుష్కరాల సమయంలో దీనిని ఏర్పాటు చేశారు. అయితే దేవాన్ష్ పేరుతో ఉన్న ఈ పుష్కర ఘాట్ ను ఆదర్శ ఘాట్ గా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారని స్వయంగా రాజానగరం ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. జిల్లా కలెక్టర్ సైతం ఈ ఘాట్ ను పరిశీలించారు. మోడల్ ఘాట్ గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో దేవాన్ష్ ఘాట్ అంటూ వార్త వైరల్ కావడంపై స్పందించారు నారా లోకేష్. వెంటనే ఆ బోర్డు తొలగించే ఏర్పాటు చేశారు.
