Nara Lokesh: ఏపీలో డిప్యూటీ సీఎం వివాదం కాక రేపింది. లోకేష్ ను( Nara Lokesh ) డిప్యూటీ సీఎం చేయాలని టిడిపి నుంచి ప్రతిపాదన వచ్చింది. అదే వివాదానికి కారణమైంది. పవన్ మద్దతుదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సోషల్ మీడియాలో టిడిపి, జనసేన అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది. దీనిపై ఇరు పార్టీలు స్పందించాయి. ఈ అంశంపై ఎవరు స్పందించవద్దని స్పష్టం చేశాయి. ఈ తరుణంలో మంత్రి లోకేష్ ఈ ఇష్యూ పై స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి లోకేష్ కు అత్యంత సన్నిహిత నేతలే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడం విశేషం. సీఎం చంద్రబాబు సమక్షంలో కడప జిల్లాకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ముందుగా దీనిపై స్పందించారు. పవన్ తో పాటు సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడ నుంచి టీడీపీ నేతలు ఈ ప్రకటన చేయడంలో పోటీపడ్డారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభం అయ్యింది.
* పవన్ కు ఒక్కరికే ఆ పదవి
మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అధికారంలోకి వస్తే చంద్రబాబు( Chandrababu) ముఖ్యమంత్రి అని తేల్చేశాయి. పవన్ కళ్యాణ్ కు గౌరవం ఇవ్వాలని కూడా నిర్ణయించాయి. ఏకైక డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తేనే ఆ గౌరవం ఉంటుందని భావించాయి. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటింది. అప్పుడే లోకేష్ కు పదోన్నతి కల్పించాలన్న డిమాండ్ టిడిపి నుంచి వినిపించింది. అది కూడా పవన్ తో సమానంగా డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలన్నది ఈ డిమాండ్. దీనికి జన సైనికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే జరిగితే తమకు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కావాలని ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కూటమిలో అతిపెద్ద పార్టీ తమదని.. తమ పార్టీ భవిష్యత్తు నేతకు పదోన్నతి ఇస్తే తప్పా అని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఇది రెండు పార్టీల మధ్య రచ్చగా మారింది. అందుకే దీనిపై ఎటువంటి ప్రకటనలు చేయవద్దని టిడిపి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జనసేన నాయకత్వం నుంచి సైతం అదే తరహా ప్రకటన వచ్చింది.
* లోకేష్ విభిన్న స్పందన
తాజాగా ఈ వివాదంపై మంత్రి నారా లోకేష్( Nara Lokesh ) స్పందించారు. ప్రస్తుతం ఆయన దావోస్ పర్యటనలో ఉన్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తనపై నమ్మకంతో చాలా కీలక బాధ్యతలు అప్పగించారని చెప్పుకొచ్చారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు నమ్మకాన్ని ఆశయాన్ని సాధించేందుకు క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నానని వివరించారు. ఇతర ఆలోచనలకు తావు లేదని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు ఎన్నికల్లో తమకు తిరుగులేని మెజారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని లోకేష్ స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదానికి లోకేష్ ఫుల్ స్టాప్ పెట్టినట్లేనని తెలుస్తోంది.
* కూటమిలో లుకలుకలు
ఈ వివాదంతో కూటమిలో( Alliance ) ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. సాఫీగా సాగిపోతున్న కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. రెండు పార్టీలకు ఇదే రకమైన సంకేతాలు ఇవ్వడంతో నాయకత్వాలు అలెర్ట్ అయ్యాయి. దిద్దుబాటు చర్యలకు దిగాయి. లోకేష్ సైతం అందులో భాగంగానే ప్రత్యేక ప్రకటన చేయాల్సి వచ్చింది. అయితే ఈ మొత్తం విభాగంలో రెండు పార్టీల శ్రేణులతో పాటు వైసిపి కూడా భాగస్వామ్యం అయింది. ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు వైసీపీకి అవసరం. అందుకే ఆ పార్టీ ఆరాటపడింది. ఆ పార్టీ ఆశపడినట్లే రెండు పార్టీల మధ్య గ్యాప్ ఏర్పడింది. లోకేష్ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారే గాని.. మున్ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.