Pawan Kalyan Visits Ippatam: తనను నమ్ముకున్న వారి విషయంలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ప్రత్యేక అభిమానంతో ఉంటారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారికి గుర్తుపెట్టుకుంటారు. అప్పుడెప్పుడో వైసిపి హయాంలో విశాఖకు చెందిన మత్స్యకార మహిళ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. అప్పటి జగన్ పాలనపై గట్టిగానే విరుచుకుపడేవారు. అటువంటి ఆమె పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కనిపిస్తే ఆప్యాయంగా పలకరించారు. ఆ అభిమానానికి ఆమె కన్నీటి పర్యాంతం కూడా అయింది. తాజాగా బండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు అయితే పవన్ కళ్యాణ్ ను చూసి ఆనందంతో పరవశించిపోయింది. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామాన్ని సందర్శించారు పవన్ కళ్యాణ్. గ్రామస్తులతో ఆనందంగా గడిపారు.
జనసేన ఆవిర్భావ సభ అక్కడే..
వైసిపి ( YSR Congress )ప్రభుత్వ హయాంలో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఇప్పటం గ్రామంలో నిర్వహించారు. అప్పట్లో ఈ సభకు జగన్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డు తగిలింది. ఇటువంటి సమయంలో ఇప్పటం గ్రామస్తులు తమ పొలాల్లో సభ జరుపుకునేందుకు వీలుగా ముందుకు వచ్చారు. జనసేన సభ అక్కడ సక్సెస్ అయింది. అప్పటి ప్రభుత్వానికి వారు టార్గెట్ అయ్యారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉండేవారు మంగళగిరి కి. 2022లో రోడ్డు విస్తరణ పేరు చెప్పి గ్రామంలోని ఇళ్లను ధ్వంసం చేశారు. చాలా రకాల వేధింపులకు గురయ్యారు ఆ గ్రామస్తులు. కేవలం జనసేన ఆవిర్భావ సభకు పొలాలు ఇచ్చినందుకు ఇబ్బందులకు గురిచేసింది జగన్ సర్కార్.
నాడు ప్రకంపనలు..
అయితే ఇప్పటం( ippatam) గ్రామస్తుల బాధలను చూసి పవన్ కళ్యాణ్ ఉద్రేకానికి లోనయ్యారు. 2022లో గ్రామస్తులను పరామర్శించేందుకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్నారు పోలీసులు. ఆ సమయంలో ఓపెన్ టాప్ కారు పైన పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం.. ఇచ్చిన నినాదాలు పూనకాలు పుట్టించాయి. మూడు కిలోమీటర్ల కు పైగా నడిచి గ్రామానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. మనల్ని ఎవడ్రా ఆపేది అనే డైలాగ్ కూడా అప్పటిదే. అయితే అప్పట్లో బండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు పవన్ కళ్యాణ్ ను చూసి రోదించింది. ఆమెను ఓదార్చారు పవన్. అధికారంలోకి వచ్చిన తర్వాత పరామర్శిస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు పవన్. మరోవైపు వైసీపీ సర్కార్ వేసిన దొంగ కేసులతో వారికి జరిమానా కూడా పడింది. ఆ పరిహారం కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ చెల్లించారు. అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ఇప్పటం గ్రామాన్ని సందర్శించారు. ప్రత్యేకంగా బండ్ల నాగేశ్వరమ్మను చూసి పవన్ కళ్యాణ్ ఎంతో ఆనందించారు. నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ గ్రామస్తులతో ఆనందంగా గడిపారు పవన్. ఆయనను చూసి గ్రామం కూడా మురిసిపోయింది.