Chintamaneni Prabhakar: రాజకీయాల్లో( politics) మంచి పేరు తెచ్చుకున్న నాయకులు చాలామంది ఉన్నారు. ప్రజల మన్ననలు పొందిన వారు ఉన్నారు. అయితే కొందరు మాత్రం అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ అందరిలో చెడ్డ పేరు పొందుతుంటారు. అయితే మరికొందరు మాత్రం తమదైన దూకుడుతో లేనిపోని వివాదాలు తెచ్చుకుంటారు. అలాంటి వారే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద అంశంలో చిక్కుకొని కనిపిస్తారు. దూకుడు తనంతో రాజకీయాలు చేసి చాలా రకాల విమర్శలు తెచ్చుకుంటారు. దెందులూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చింతమనేని ప్రభాకర్. ఒకవైపు దూకుడు కనబరుస్తూనే.. మరోవైపు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చింతమనేని ప్రభాకర్ చౌదరి. తాజాగా ఆయన ఓ వ్యక్తిపై తిట్ల దండకం అందుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను ఒక ప్రజా ప్రతినిధిని అని గుర్తించకుండా.. సభ్య సమాజం తలదించుకునేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
* స్వల్ప కాలంలోనే ఎమ్మెల్యేగా
ఎంపీపీ అయిన చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) తన దూకుడుతో స్వల్ప కాలంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు దెందులూరు నుంచి విజయం సాధించారు. అయితే దశాబ్దాల రాజకీయ చరిత్రలో చింతమనేని పై ప్రత్యేకతలు రౌడీ అన్నముద్ర వేశారు. అందుకు తగ్గట్టుగానే ఆయన వ్యవహార శైలి ఉంటుంది. అదే సమయంలో ప్రజలు పిలిస్తే పలికే నాయకుడిగా కూడా గుర్తింపు సాధించారు. అయితే ఆయన దూకుడుగా వ్యవహరించే క్రమంలో చాలా రకాల కేసులు ఎదురయ్యాయి. 2019లో ఆయన ఓడిపోయిన తర్వాత చాలా రకాల కేసులు బయటకు వచ్చాయి. ఇక ఆయన పని అయిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో.. ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.
* తాహసిల్దార్ పై దాడితో
2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. దెందులూరు ఎమ్మెల్యేగా ప్రభాకర్ గెలిచారు. అయితే ఆ సమయంలో అక్రమ ఇసుక దందాను అడ్డుకున్నందుకు మహిళా తహసిల్దార్ వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్ దాడి చేయడం సంచలనంగా మారింది. ఓ మహిళ అధికారిపై దాడి చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎమ్మెల్యే పై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా.. ఆ తహసిల్దారినే తప్పు పట్టారు. అప్పటినుంచి చింతమనేని అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్నారు. ప్రజలతో పాటు ప్రత్యర్థుల మీద దాడులు చేయిస్తారన్న అపఖ్యాతి ఆయనపై ఉంది.
* గెలిచిన తర్వాత సైలెంట్
ఈ ఎన్నికల్లో దెందులూరు( denduluru) నుంచి మరోసారి గెలిచారు చింతమనేని ప్రభాకర్. గత కొద్దిరోజులుగా పొలిటికల్ గా ఆయన సైలెంట్ గా ఉన్నారు. పెద్దగా బయట వ్యవహారాల్లో కనిపించడం లేదు. అయితే ఏదో ఒక వివాహ వేడుకలకు హాజరైన ఆయన.. తన ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగడం కనిపించింది. తిట్లతో ఆయన దాడి చేసినంత పని చేశారు. వాహనాల పార్కింగ్ సమయంలో.. ముందుకెళ్తున్న అబ్బయ్య చౌదరి వాహనాన్ని చూసి.. కిందకు దిగిన చింతమనేని తీవ్రస్థాయిలో హెచ్చరిస్తూ.. బూతులతో రెచ్చిపోవడం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు ఈ వీడియోను వైరల్ చేసినట్లు తెలుస్తోంది.