Pawan Kalyan personality rights: సోషల్ మీడియాకు( social media) తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడైంది. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు ప్రచారం చేస్తున్నారు. సామాన్యులే కాదు పెద్దవారు సైతం ఇబ్బందులు పడుతున్నారు. బాధిత వర్గంగా మారుతున్నారు. ఈ జాబితాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తన వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారు అంటూ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఢిల్లీ హైకోర్టులో పవన్ తరపున ఆయన న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించింది ఢిల్లీ హైకోర్టు. వారం రోజుల్లోగా ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని పవన్ తరుపు న్యాయవాదికి ఆదేశాలు జారీచేసింది కోర్టు.
రాజకీయ ప్రత్యర్థులు..
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Power Star Pawan Kalyan). విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం ఆయనకు ఉంది. రాజకీయాల్లోకి వచ్చాక ఆయనకు ప్రత్యర్ధులు ఎక్కువయ్యారు. వ్యతిరేక ప్రచారం కూడా ఎక్కువైంది. వ్యతిరేక ప్రచారానికి పెద్ద ఎత్తున సోషల్ మీడియాను సైతం ఏర్పాటు చేశారు. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ చిత్రాలతో పాటు కామెంట్స్ ను వైరల్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున తప్పుడు పోస్టులు పెడుతున్నారు. ఆయనను రాజకీయంగా, వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంటున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం సీరియస్ గా స్పందించింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని గూగుల్, మెటా, ఎక్స్ లను ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. విచారణను డిసెంబర్ 22 కు వాయిదా వేసింది.
బాధిత జాబితాలో ప్రముఖులు..
అయితే ప్రముఖులపై వ్యక్తిగత దురుద్దేశ ప్రచారం కొత్త కాదు. ఇటీవల ప్రభాస్( Prabhas), అనుష్కల వివాహం అయినట్టు.. దానికి టాలీవుడ్ హీరోలంతా సహకరిస్తున్నట్టు ఓ వీడియోని చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇది పెద్ద దుమారమే రేపింది. తెలుగు నటుడు అక్కినేని నాగార్జున సైతం ఈ ఏడాది సెప్టెంబర్ లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులను భంగం కలిగేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్న తీరును కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అప్పుడు కూడా కోర్టు సీరియస్ గా స్పందించింది. విచారణకు ఆదేశించింది. అయితే నాగార్జున కాదు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సైతం అప్పట్లో కోర్టును ఆశ్రయించిన దాఖలాలు ఉన్నాయి.