Liquor Scam : ఢిల్లీ, చత్తీస్ గడ్ సరే.. ఏపీలో లిక్కర్ స్కాం బీజేపీకి ఎందుకు కనిపించడం లేదు?

బీజేపీ ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో భారీ లిక్కర్ స్కాం వెలుగుతీస్తే వైసీపీ ప్రజల ముందు దోషిగా నిలబడుతుంది. వైసీపీ, బీజేపీ ఒకటి కాదన్న సంకేతం ప్రజలకు పంపించినట్టవుతుంది.

Written By: Dharma, Updated On : May 8, 2023 11:06 am
Follow us on

Liquor Scam : దేశంలో ఏపీ తీరు వేరయా అన్నది అందరికీ తెలిసిందే. ఏ రాష్ట్ర పాలకులకు రాని విధంగా మూడు రాజధానుల ఆలోచన వచ్చింది తొలుత ఏపీ పాలకులకే. ఉన్న అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులకు అడుగు వేయలేక ఎదురువుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని అపఖ్యాతిని మూటగట్టారు. అంతా రివర్స్ పాలన సాగిస్తున్నారు. అయితే కట్టడి చేయాల్సిన స్థానంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేష్టలూడి చూస్తోంది. ఏపీ సర్కారుకు ఇతోధికంగా సాయపడుతుందన్న అపఖ్యాతిని మూటగట్టుకుంటోంది. ఇప్పుడు ఏపీని విడిచిపెట్టి ఢిల్లీ, చత్తీస్ గడ్ లలో లిక్కర్ స్కాం పై ఫోకస్ చేయడం కూడా విమర్శలకు తావిస్తోంది.

పేరుకే ప్రభుత్వం..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నూతన మద్యం పాలసీని ప్రారంభించింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడుపుతోంది. పేరుకే ప్రభుత్వ మద్యం దుకాణాలు కానీ మద్యం సరఫరా, రవాణా ఇలా అన్ని అధికార పార్టీ నేతల ముసుగులో జరుగుతున్నాయి. మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వ పెద్దల గుప్పిట్లో ఉంది. అమ్మేది ప్రభుత్వం పేరు మీద. కానీ అందులో మనుషులు దగ్గర్నుంచి లిక్కర్ బ్రాండ్లు, రవాణా సహా మొత్తం అయిన వాళ్ల గుప్పిట్లోనే ఉంది. పైగా అంతా పూర్తిగా నగదు లావాదేవీలు. ఎన్ని వేల కోట్లు వెనకేశారో చెప్పడం కష్టం.పేరుకే సర్కారు మద్యం దుకాణాలు.. కానీ గతంలో కనీవినీ ఎరుగని రీతిలో మద్యం అక్రమ వ్యాపారం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.

ఆ రెండు రాష్ట్రాలపై ఫోకస్
అయితే ఏపీలో జరుగుతున్న లిక్కర్ స్కాం గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీ, చత్తీస్ గడ్ లలో మద్యం వ్యాపారాలపైనే ఈడీ కేసులు పెడుతోంది. బీజేపీయేతర ప్రభుత్వాలు అక్కడ పాలన సాగిస్తుండడమే అందుకు కారణం.వాస్తవానికి  చత్తీస్ ఘడ్‌లో లిక్కర్ పాలసీ దాదాపుగా ఏపీ పాలసీలానే ఉంది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అక్కడ ప్రైవేటు వ్యాపారులకు తావు లేదు. మొత్తం 800 లిక్కర్ షాపుల ద్వారా సర్కారే రోజు మద్యం విక్రయిస్తుంది.చత్తీడ్ గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వరంలో మొత్తం తంతు నిర్వహిస్తారు. అచ్చం అక్కడ ఏపీ మాదిరిగానే తతంగం నడుస్తోంది.

ఒకే వ్యక్తి అన్నీతానై..
చత్తీస్ గడ్ లో అధికార కాంగ్రెస్ నేతలకు దగ్గర వ్యక్తి అయిన అన్వర్ అనే వ్యక్తి పూర్తిగా చక్రం తిప్పడం ప్రారంభించాడు.అన్ని విభాగాల్లో అతని అనచురులు దూరిపోయి ప్రైవేటు డిస్టిలరీల్లో మద్యం సేకరణ నుంచి… లైసెన్సులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, సీసాల తయారీదారులు, నగదు వసూలు శాఖల వరకు అన్ని చోట్ల కమిషన్లకు తెరతీశాడు. మద్యం సేకరణ సమయంలోనే ప్రైవేటు లిక్కర్ వ్యాపారుల నుంచి కేసుకు రూ.150 వరకు కమిషన్ పొందినట్లు ఈడీ చెబుతోంది. అన్వర్ స్వయంగా మద్యం తయారు చేయించి.. ప్రభుత్వ లెక్కల్లో చూపించకుండా ప్రభుత్వ మద్యం షాపుల్లో విక్రయించాడు. నగదు రూపంలోనే విక్రయాలు జరపడం ద్వారా అవి ప్రభుత్వ రికార్డుల్లోకి వెళ్లకుండా చూసుకున్నాడు. ఇప్పటివరకూ 40 శాతం మద్యం విక్రయించి సొమ్ము చేసుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరి ఇక్కడో?
అయితే చత్తీస్ గడ్ మాదిరిగా అక్రమ మద్యం వ్యాపారం జరగలేదా? అంటే ఇట్టే సమాధానం దొరికిపోతుంది. ఇక్కడ ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలే కనిపిస్తాయి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పట్టకపోవడం విశేషం. ఇప్పటికే ఏపీలో ల్యాండ్, శ్యాండ్, లిక్కర్ స్కాంలపై చార్జిషీట్ల హడావుడి నడుస్తోంది. ఇందుకుగాను బీజేపీ ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో భారీ లిక్కర్ స్కాం వెలుగుతీస్తే వైసీపీ ప్రజల ముందు దోషిగా నిలబడుతుంది. వైసీపీ, బీజేపీ ఒకటి కాదన్న సంకేతం ప్రజలకు పంపించినట్టవుతుంది. ఇక తేల్చుకోవాల్సింది బీజేపీ కేంద్ర పాలకులే…