Dharmana Prasad: ఓటమి గుణపాఠం.. సంచలన నిర్ణయం దిశగా ధర్మాన?

శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి మండల అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ధర్మాన ప్రసాదరావు. యూత్ కాంగ్రెస్ లో చాలా యాక్టివ్ గా పని చేశారు. 1989 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి నరసన్నపేట నుంచి గెలుపొందారు. మంత్రి పదవిని సైతం చేజిక్కించుకున్నారు. తరువాత ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో.. ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యారు.

Written By: Dharma, Updated On : July 9, 2024 1:49 pm

Dharmana Prasad

Follow us on

Dharmana Prasad: ఆ మాజీ మంత్రి రాజకీయ సన్యాసం చేశారా? దారుణ ఓటమితో రాజకీయాల నుంచి తప్పుకున్నారా? అవమానకరంగా భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయనే సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు. ఎన్నికల్లో ఒక సామాన్య నేత చేతిలో ఆయన ఓడిపోయారు. ఏకంగా 52,521 ఓట్లతో పరాజయం పాలయ్యారు. దానిని తట్టుకోలేక.. ప్రజల్లోకి రావడం మానేశారు. కనీసం మీడియా కంట కూడా కనిపించడం లేదు. అటు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. దీంతో ధర్మాన ప్రసాదరావు రాజకీయాలకు దూరమయ్యారు అన్న ప్రచారం శ్రీకాకుళం జిల్లాలో వ్యాపిస్తోంది.

ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో వైసిపి పూర్తిగా భూస్థాపితం అయ్యింది. పది అసెంబ్లీ స్థానాలకు గాను.. అన్నిచోట్ల ఆ పార్టీ ఓడిపోయింది. పది నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు రికార్డ్ స్థాయిలో మెజారిటీలు దక్కాయి. ఎక్కడా మెజారిటీలు 20వేల ఓట్లకు తగ్గలేదు. కానీ అందరికంటే ఎక్కువ మెజారిటీ దక్కింది మాత్రం శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలోనే. అక్కడ టిడిపి అభ్యర్థిగా ఓ సామాన్య సర్పంచ్ గొండు శంకర్ పోటీ చేశారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అభ్యర్థిత్వాన్ని తప్పించడంతో.. ఇక తన ఎన్నిక లాంఛనమేనని ధర్మాన ప్రసాదరావు భావించారు. ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని ధీమాతో ఉండేవారు. కానీ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 52,521 ఓట్లతో శంకర్ ఘనవిజయం సాధించారు. దీంతో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ తరహా ఓటమిని ఊహించని ఆయన పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కనీసం ఓటమి తర్వాత ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడలేదు. బాహ్య ప్రపంచానికి రాలేదు. దీంతో ఆయన కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి మండల అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ధర్మాన ప్రసాదరావు. యూత్ కాంగ్రెస్ లో చాలా యాక్టివ్ గా పని చేశారు. 1989 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి నరసన్నపేట నుంచి గెలుపొందారు. మంత్రి పదవిని సైతం చేజిక్కించుకున్నారు. తరువాత ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో.. ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యారు. 2003లోరాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో జిల్లాలో కీలకపాత్ర పోషించారు ధర్మాన. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కీలకమైన రెవెన్యూ శాఖను దక్కించుకున్నారు. 2009లో సైతం గెలిచి అదే పోర్టు పోలియోతో మంత్రి పదవి చేపట్టారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంతవరకు ఒక వెలుగు వెలిగారు ధర్మాన. 2010లో వైసీపీ ఆవిర్భావంతో సోదరుడు ధర్మాన కృష్ణ దాస్ జగన్ వెంట నడిచారు. అప్పటికే మంత్రిగా ఉండడంతో ధర్మాన వెనుకడుగు వేశారు. 2014 ఎన్నికల నాటికి వైసిపి గూటికి చేరారు ధర్మాన. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో మాత్రం తక్కువ మెజారిటీతో గట్టెక్కారు.కానీ జగన్ మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. కానీ విస్తరణలో చోటు దాకడంతో పదవి చేపట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న స్వేచ్ఛ జగన్ వద్ద లభించలేదు. ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి చెందేసరికి రాజకీయ సన్యాసం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మున్ముందు ధర్మాన ఎలాంటి నిర్ణయం తీసుకున్న అది సంచలనమే.