Reddy Satyanarayana: సర్పంచ్ పదవికే దర్పం ప్రదర్శించే రోజులు ఇవి. వార్డు సభ్యుడిగా ఎన్నికైతే చాలు తనకంటూ గుర్తింపు కోసం ఆరాటపడే రోజులు ఇవి. అటువంటిది ఐదు సార్లు ఎమ్మెల్యేగా,ఒకసారి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఓ నేత ఏ స్థాయిలో ఉండాలి.కానీ ఆయన అలా చేయలేదు. దర్పం ప్రదర్శించలేదు. అధికారాన్ని చెలాయించలేదు. ఖరీదైన వాహనాల్లో తిరగలేదు. సాటి ప్రయాణికులతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ప్రజా ప్రతినిధి అంటే ఇంత సింపుల్ గా ఉంటారు అనేలా వ్యవహరించారు. ఆయనే మాజీమంత్రి రెడ్డి సత్యనారాయణ. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే సీనియర్ ఎమ్మెల్యేగా ఉండేవారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేశారు. వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడుగా కూడా కొనసాగారు.గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయనఈరోజు మృతి చెందారు. ఆయన వయస్సు 99 సంవత్సరాలు.ఆయన మృతి పై పార్టీ అధినేత,ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.
* వరుసగా ఐదుసార్లు మాడుగుల నుంచి..
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెద్ద గోగాడ ఆయన స్వగ్రామం. ఎన్టీఆర్ పిలుపుతో టిడిపిలో చేరారు రెడ్డి సత్యనారాయణ. 1983 నుంచి 5 సార్లు వరుసగా మాడుగుల నియోజకవర్గం నుంచి గెలిచారు.1983,1985,1989,1994, 1999 ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో పశుసంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అప్పటినుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండేవారు. సీనియర్ నేత అయిన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఆదర్శంగా నిలిచేవారు.గత ఏడాదిగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఆయన తుది శ్వాస విడిచారు.
* బలమైన బీసీ నేత
ఉత్తరాంధ్రలో బలమైన బీసీ నేతగా గుర్తింపు పొందారు రెడ్డి సత్యనారాయణ.ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలను సైతం శాసించారు.మంచి దూకుడు కలిగిన నేత. పార్టీ పట్ల నిబద్ధత కూడా ఎక్కువ.ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశంలో చేరిన ఆయన..తుది శ్వాస విడిచే వరకు అదే పార్టీలో కొనసాగడం విశేషం.అయితే తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేతను కోల్పోవడంతో సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సేవలను కొనియాడారు.