Davos 2026: దావోస్ లో( davos ) ప్రపంచ పెట్టుబడుల సదస్సులు ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే చాలా సంస్థలు, పరిశ్రమలు ఏపీకి వచ్చేందుకు ముందుకు వచ్చాయి. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుకు బలమైన హామీ లభించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ ముందుకు వచ్చింది. తాజాగా దుబాయ్ ఆర్థిక శాఖ మంత్రి అల్ మార్రీ సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఏపీ, దుబాయ్ ల మధ్య ఉన్న ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై చర్చించారు. దీంతో పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమం అయింది.
బలమైన ఆర్థిక వ్యవస్థ..
దుబాయ్( Dubai) ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది. ప్రపంచ దేశాల్లోనే ఆర్థికవంతమైన బలం ఆ దేశం సొంతం. అటువంటి దేశం ఏపీతో ఆర్థిక బంధాలను మెరుగుపరుచుకుంటామని చెప్పడం మాత్రం శుభపరిణామం. ఇరు ప్రాంతాల మధ్య ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సహకరించాలని చంద్రబాబు కోరారు. దీనికి దుబాయ్ ఆర్థిక శాఖ మంత్రి స్వాగతించారు. ముఖ్యంగా ఆహార తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దుబాయ్ కి సంబంధించి 40 కి పైగా కంపెనీలు ఏపీలో బ్రాంచీలు ఏర్పాటు చేసేందుకు ఆయన సహకరిస్తామని చెప్పారు. ఇతర రంగాల్లోనూ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని చంద్రబాబుకు ఆయన వివరించారు.
అదే పనిగా చంద్రబాబు..
ఏపీలో ఆహార భద్రత, లాజిస్టిక్స్( Logistics), పోర్టు ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను చంద్రబాబు ప్రపంచ ఆర్థిక సదస్సుల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. సెమీ కండక్టర్ రంగానికి ఏపీ ప్రధాన వేదికగా ఉందని కూడా గుర్తు చేస్తున్నారు. పునరుత్పాదక ఇంధన వనరులు, పట్టణ అభివృద్ధి, మౌలిక వస్తువుల రంగాల్లో కూడా పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఏపీలో నైపుణ్యం కలిగిన యువత అధికంగా ఉన్నారని.. వారిని సమర్థంగా వినియోగించుకుంటే సత్ఫలితాలు ఉంటాయని పారిశ్రామికవేత్తలను ఒప్పిస్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు చెప్పేసరికి దుబాయ్ ఆర్థిక శాఖ మంత్రి సైతం హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందుకే 40 కి పైగా కంపెనీలు తమ బ్రాంచ్ లు ఏర్పాటు చేసుకునేలా చూస్తామని ప్రకటన కూడా చేయడం విశేషం.