Danger Zone Survey : ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఈనెల 12 నాటికి ఏడాది పాలన పూర్తి కానుంది. గత ఏడాది అదే రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మరో 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. పాలనా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఏడాది కాలంలో ప్రభుత్వం దూకుడు నిర్ణయాలు తీసుకుంది. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. ఈ నెలలో కీలకమైన రెండు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధపడింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాగానే కష్టపడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే వారి విషయంలో ప్రజల నుంచి సానుకూలత వస్తోంది. కానీ ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం వ్యతిరేకత పెరుగుతోంది. ఈ విషయాన్ని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. కూటమి ఎమ్మెల్యేలపై క్రమేపి వ్యతిరేకత పెరుగుతోందని హెచ్చరిస్తున్నాయి. వైసిపి హయాంలో కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చిన రైజ్ సర్వే సంస్థ.. ఇప్పుడు కూటమికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వే వివరాలు వెల్లడించడం విశేషం. సదరు సర్వే ప్రతినిధి ప్రవీణ్ పుల్లట ప్రాంతాలవారీగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు ఇస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్రకు సంబంధించి సర్వే వివరాలను వెల్లడించారు.
* 32 చోట్ల టిడిపి కూటమి ఎమ్మెల్యేలు
ఉత్తరాంధ్రలో( North Andhra) 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు, ఉమ్మడి విజయనగరంలో 9, ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో 34 అసెంబ్లీ స్థానాలకు గాను టిడిపి కూటమి 32 చోట్ల విజయం సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల మాత్రమే గెలుపొందింది. శ్రీకాకుళం తో పాటు విజయనగరంలో టిడిపి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. పార్లమెంట్ స్థానాలను సైతం టిడిపి కూటమి గెలుచుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం అరకు పార్లమెంటు స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో టిడిపి కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి నెలకొని ఉందని రైజ్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. సగానికి పైగా ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ప్రవీణ్ పుల్లట సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దీంతో ఇది టిడిపి కూటమికి మింగుడు పడని అంశంగా మారింది.
* సగానికి పైగా ఎమ్మెల్యేలపై అసంతృప్తి
32 మంది టిడిపి కూటమి( TDP Alliance ) ఎమ్మెల్యేలు 17 మంది పై అసంతృప్తి ఉందని తాజాగా ఈ సర్వే వెల్లడించింది. అయితే ఓ 9 మంది ఎమ్మెల్యేలపై మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టమైంది. ఏడాది పాలన సందర్భంగా ప్రవీణ్ పుల్లట ఈ సర్వే ఫలితాలను వెల్లడించారు. నాలుగు ప్రాంతాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మొత్తం ఎమ్మెల్యేల జాబితా మీకోసం అంటూ ఆయన హింట్ ఇచ్చారు. త్వరలో మిగిలిన మూడు ప్రాంతాల లెక్కలను విడుదల చేసేందుకు తమ రైజ్ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో టీడీపీ కూటమి శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. గతంలో ఇదే సంస్థ కూటమికి అనుకూల ఫలితాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
* ప్రభుత్వంపై కొంత సానుకూలత..
అయితే ఇటీవల వరుసగా వస్తున్న సర్వేలు చూస్తే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వుంటోంది. కానీ అదే సమయంలో ప్రభుత్వంపై కొంత సానుకూలత కనిపిస్తోంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ చక్కగా పనిచేస్తున్నారని సర్వేల్లో తేలుతోంది. అయితే ప్రభుత్వ నిఘా వర్గాలు, అంతర్గత సర్వేలతోనే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలే పంపుతున్నారు. పనితీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు గట్టిగానే మాట్లాడారు. మొత్తానికైతే ఈ సర్వే ఫలితాలు కూటమికి మింగుడు పడడం లేదు
ఏడాది పాలన సందర్భంగా..
ఉత్తరాంధ్ర రైజ్ సర్వే ఫలితాలు
17 మంది కూటమి ఎమ్మెల్యేలపై స్పష్టమైన వ్యతిరేకత..9మందిపై తీవ్రమైన వ్యతిరేకత..నాలుగు ప్రాంతాలనుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మొత్తం ఎమ్మెల్యేల జాబితా మీకోసం.. stay tuned
— Praveen Pullata (@praveenpullata) June 7, 2025