Ex Minister Roja : మాజీ మంత్రి రోజా వంతు వచ్చింది. ఇప్పటివరకు పలువురు తాజా మాజీలపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ జాబితాలో కొడాలి నాని,జోగి రమేష్ లాంటి నేతలు ఉండగా.. ఇప్పుడు మాజీ మంత్రి ఆర్కే రోజాపై ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా ఆమెపై కర్నూలులో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. రోజా మంత్రిగా పనిచేసిన సమయంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి దళిత సంఘాలు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి. దళితులను అవమానించేలా రోజా వ్యవహరించారన్నది ఈ ఫిర్యాదు సారాంశం. వైసీపీ హయాంలో రోజా దూకుడుగా ఉండేవారు. మంత్రిగా వ్యవహరించిన సమయంలో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసేవారు. చంద్రబాబుతో పాటు టిడిపి నేతలపై విరుచుకుపడేవారు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రోజాపై టార్గెట్ చేయడం ఖాయమని ప్రచారం నడిచింది. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా కనిపించకుండా పోయారు. పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైనా తాడేపల్లి నుంచి మాట్లాడడం చాలా తక్కువ. అలాగని సొంత నియోజకవర్గం నగిరి వైపు కూడా కనిపించడం లేదు. దీంతో రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. రోజా తమిళ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే వాటన్నింటికీ బ్రేక్ చెబుతూ ఆమె వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. అప్పటినుంచి టిడిపి తో పాటు వైసిపి ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ వచ్చారు.
* జరిగింది ఇది
అయితే రోజాపై తాజాగా ఒక కేసు నమోదు అయింది. రోజా మంత్రిగా ఉన్న సమయంలో 2023 ఫిబ్రవరిలో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ను సందర్శించారు. బీచ్ లో సరదాగా గడిపారు. అయితే ఆ సమయంలో మంత్రి రోజా చెప్పులు ఓ ఉద్యోగి పట్టుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా దళితులను అవమానించారంటూ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి.
* సరదాగా సందర్శన
అప్పట్లో రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉండేవారు. ఆ సమయంలోనే బాపట్లలోని సూర్యలంక బీచ్ ను సందర్శించారు. టూరిజం అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. ఆ సమయంలో తన చెప్పులను బయట వదిలి సముద్రపు ఒడ్డున నీటిలో కాసేపు విహరించారు. అయితే ఆ సమయంలో రోజా వ్యక్తిగత సహాయకుడు ఆమె చెప్పులను మోయటం అప్పట్లో వివాదాస్పదం అయింది. ఈ వీడియో వైరల్ కావడంతో అప్పట్లో విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే గత ఏడాది జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు కర్నూలు పోలీస్ స్టేషన్లో దళిత సంఘాలు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.