Daggubati Purandeswari: ఎన్టీఆర్( NTR) వారసులు ఏపీ రాజకీయాలపై విపరీతంగా ప్రభావం చూపుతున్నారు. అందులో ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ది ప్రత్యేక స్థానం. ఆమె ప్రస్తుతం బిజెపి ఎంపీగా ఉన్నారు. జాతీయ స్థాయిలో సైతం మంచి గుర్తింపు పొందారు. త్వరలో కేంద్రమంత్రి పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు. ఆపై బిజెపి జాతీయ అధ్యక్ష పదవికి ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో దగ్గుబాటి పురందేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. 2029 ఎన్నికల నాటికి అనూహ్య నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో సంచలనమే. ఎన్టీఆర్ వారసురాలిగా కుమార్తెల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో పురందేశ్వరి ఒక్కరే. అయితే అనతి కాలంలోనే ఏపీ రాజకీయాలపై పెను ప్రభావం చూపారు పురందేశ్వరి. కానీ ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* టిడిపిలో సీనియర్ అయినా..
తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) చంద్రబాబు కంటే ముందే దగ్గుబాటి వెంకటేశ్వరరావు జర్నీ ప్రారంభించారు. చంద్రబాబు కంటే పెద్ద అల్లుడిగా వెంకటేశ్వరరావుకు గుర్తింపు ఉంది. అయితే తెలుగుదేశం పార్టీలో మాత్రం ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు చంద్రబాబు. జాతీయ స్థాయిలో సైతం నేతగా గుర్తించబడ్డారు. చంద్రబాబుతో విభేదించిన దగ్గుబాటి తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తరువాత బిజెపిలోకి వచ్చారు. ఈ క్రమంలో మూడుసార్లు ఎంపీ అయ్యారు దగ్గుబాటి పురందేశ్వరి. జాతీయ పార్టీగా ఉన్న బిజెపికి రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు. అయితే ఈసారి ఎంపీగా గెలిచేసరికి మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆ ఛాన్స్ దక్కలేదు. విస్తరణలో దక్కుతుందని ఆశిస్తున్నారు. అయితే ఒకవేళ మంత్రి పదవి వచ్చినా.. రాకపోయినా 2029 ఎన్నికల నాటికి రాజకీయాలకు గుడ్ బై చెబుతారని తెలుస్తోంది.
* వారసుడు ఎంట్రీ..
దగ్గుబాటి వెంకటేశ్వరరావు( Daggubati Venkateswara Rao ), పురందేశ్వరి ల కుమారుడు హితేష్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా కానీ.. ఎమ్మెల్యేగా కానీ పోటీ చేస్తారని తెలుస్తోంది. వాస్తవానికి హితేష్ 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. సాంకేతిక కారణాలతో సాధ్యం కాకపోవడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు. అయితే ఇప్పుడు తల్లి పురందేశ్వరి పూర్తిస్థాయి రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే హితేష్ భారతీయ జనతా పార్టీ కాకుండా.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతారని తెలుస్తోంది. ఇప్పటికే హితేష్ నారా లోకేష్ తో సన్నిహితంగా ఉంటున్నారు. అటు బాబాయ్ చంద్రబాబుతో సైతం మంచి సంబంధాలే ఉన్నాయి. ఇటీవల దగ్గుబాటి వెంకటేశ్వరరావు తో చంద్రబాబు సన్నిహితంగా మెలుగుతున్నారు. గతంలో జరిగినవన్నీ మరిచిపోయి రెండు కుటుంబాలు సత్సంబంధాలతో ముందుకు సాగుతున్నాయి. అందుకే క్రియాశీలక రాజకీయాలకు పురందేశ్వరి గుడ్ బై చెబుతారని.. కుమారున్ని టిడిపిలోకి పంపించి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.