Cyclone Montha Politics In AP: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు మరి దిగజారిపోతున్నాయి. విపత్తుల సమయంలో సైతం రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం బిజీగా ఉండడం పై వైసీపీ సెటైరికల్ కామెంట్స్ శృతిమించుతున్నాయి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉండిపోవడం పై సైతం భిన్నంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భారీ విపత్తుగా మారి ఏపీ వైపు దూసుకొస్తుందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే ఈ విషయంలో అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు ముందస్తు అప్రమత్తత చర్యలు చేపట్టారు. సచివాలయంలో ఉంటూ నిత్య సమీక్షలు జరిపారు. అన్ని జిల్లాల యంత్రాంగాలతో మాట్లాడి తుఫాన్ హెచ్చరికలు, సహాయ చర్యల పై కీలక సూచనలు చేశారు.
Also Read: అడుగు బురదలో పవన్.. వీడియోలు వైరల్!
* చంద్రబాబు నిత్య సమీక్షలు..
తుఫాన్ తీరం దాటి బలహీన పడిన వరకు.. ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) సచివాలయంలోనే ఉంటూ నిత్య సమీక్షలు జరిపారు. తీరం తుఫాన్ దాటిన తరువాత ఏరియల్ సర్వే చేపట్టారు. ఒకే రోజు మూడు జిల్లాల్లో పంట నష్టాన్ని చూశారు. అంతకుముందే కోటి రూపాయల చొప్పున ప్రతి జిల్లాకు సహాయక చర్యల కోసం కేటాయించారు. మిగతా జిల్లాలకు సైతం 50 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయించారు. తలదాచుకున్న ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయలు అందించారు. నిత్యవసరాలు సైతం పంపిణీ చేశారు. పంట నష్టం నివేదికలను తెప్పించుకొని గురువారం అంతా సమీక్షలు జరిపారు. పంట నష్టపరిహారంపై కీలక ప్రకటన చేయనున్నారు. అయితే వైసిపి నుంచి ఒక రకమైన ప్రశ్న వస్తోంది. చంద్రబాబు ప్రచారం పిచ్చి తోనే అలా చేస్తున్నారని చెబుతోంది. తుఫాను ఆపలేకపోయారని వ్యంగ్యంగా ప్రశ్నిస్తోంది. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తుఫాన్ లాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి రాజకీయ విమర్శలు చేయడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది.
* జగన్ పై పొలిటికల్ ట్రోల్స్..
అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy) పై సైతం విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉంటే బెంగళూరు ప్యాలెస్ లో అన్న అంటూ సెటైరికల్ కామెంట్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఏపీ ప్రజలను తుఫాన్ తో ఇబ్బంది పడకుండా బెంగళూరులో అడ్డుకున్న అన్న అంటూ పోస్టులు వెలుస్తున్నాయి. బెంగళూరు నుంచి విమాన సర్వీసులు రద్దు కావడంతో మంగళవారం రావాల్సిన జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉండిపోయారు. అయితే ఇంతలో తుఫాన్ దాటిపోయింది. సీఎం చంద్రబాబు తుఫాన్ బాధితులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా పొలాల్లోకి దిగి రైతులను పరామర్శించారు. అయితే అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంతవరకు బాధితులను పరామర్శించలేదు. ఇది కూడా రాజకీయంగా విమర్శకు గురవుతోంది.