AP Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) ఈరోజు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రధానంగా కృష్ణాజిల్లా లోని పలు ప్రాంతాల్లో వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. నేరుగా పొలాలకు వెళ్లి ముంపు బారిన పడిన వరి పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. అవనిగడ్డ ప్రాంతంలో ఆయన పర్యటన సాగింది. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులతో కలిసి పవన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బురద నీటిలో పవన్ దిగుతూ నడుస్తున్న దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* అవనిగడ్డలో పరిశీలన..
ఇటీవల తుఫాన్ కు ఏపీకి( Andhra Pradesh) భారీగా నష్టం సంభవించింది. అయితే ఈ విపత్తుపై ప్రభుత్వం ముందే మేల్కొంది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయంలో ఉండి వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆర్ టి జి ఎస్ సెంటర్లో అధికారులతో కలిసి కీలక సమీక్షలు జరిపారు. నిన్ననే మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాన్ బాధితులను పరామర్శించారు. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధపడ్డారు. జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ప్రతినిత్యం వహిస్తున్న అవనిగడ్డ నియోజకవర్గం లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండడంతో.. ఆ నియోజకవర్గంలో వరి పొలాలను పరిశీలించారు.
* రైతుల మొర వింటూ..
సాధారణ పంచ కట్టులో పవన్ కళ్యాణ్ బురదలో దిగుతూ.. రైతుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను వివరించారు. భారీగా పెట్టుబడులు పెట్టామని.. నిలువునా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పవన్ ఎదుట కన్నీటి పర్యంతం అయ్యారు. ఓ కౌలు రైతు నీటిలో నిండిపోయిన వరి పనులను పవన్ కళ్యాణ్ కు చూపించారు. తాను కౌలు రైతునని.. చెప్పగా తాను అన్ని చూసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. నేరుగా పొలాలకు వెళ్లి పవన్ కళ్యాణ్ రైతులతో మమేకం కావడం గమనార్హం. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. సీఎం చంద్రబాబుతో చర్చించి తుఫాన్ నష్ట బాధితులను ఆదుకుంటామని.. మెరుగైన పరిహారం అందిస్తామని అన్నారు పవన్.