Cyclone Mantha Update: ఏపీ ( Andhra Pradesh) వైపు మరో గండం దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయానికి వాయుగుండం గా మారింది. ఏపీ వైపు దూసుకొస్తోంది. ఈనెల 28న కాకినాడ తీరంలో వాయుగుండం తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ పెను విపత్తుతో ఏపీకి భారీ ప్రమాదం ఉన్నట్లు ముందస్తుగానే హెచ్చరించింది. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు ఉంటాయని చెబుతోంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని.. ఇప్పటికే వెళ్ళినవారు తిరిగి రావాలని చెబుతోంది. ఏపీ ప్రభుత్వం సైతం అప్రమత్తం అయ్యింది. విపత్తుల నిర్వహణ సంస్థ అన్ని జిల్లాలకు భారీ హెచ్చరికలు పంపింది. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
* మొంధా తుఫానుగా నామకరణం..
ఈ భారీ వాయుగుండానికి మొంధా తుఫానుగా నామకరణం చేశారు. దీని ప్రభావం ఏపీ పై గట్టిగానే ఉంటుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. తీరం దాటి క్రమంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని స్పష్టం చేసింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని… భారీ వర్షాలు సైతం నమోదవుతాయని చెబుతోంది. గతంలో హుద్ హుద్, తితలి వంటి తుఫాన్లు ఏపీకి అపార నష్టం కలిగించాయి. మరోసారి అటువంటి హెచ్చరికలే వస్తుండడంతో ఏపీ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా ఉభయగోదావరి తో పాటు విశాఖపట్నం, జిల్లాలకు భారీ హెచ్చరికలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా జిల్లాలో సైతం ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉంటుంది. మరోవైపు తీరం వెంబడి ఉన్న పోర్టుల్లో ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
* ముందే మేల్కొన్న విద్యుత్ శాఖ..
తుఫాన్ అంటే ముందుగా గుర్తొచ్చేది విద్యుత్ శాఖ( electrical department). ఆ శాఖకు విపరీతమైన నష్టం జరుగుతుంది. నెలల తరబడి విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోతుంది. అందుకే ఈసారి ముందస్తుగానే మేల్కొంది ఏపీ ఈపీడీసీఎల్. ప్రస్తుతం తుఫాన్ తీవ్రత ఉభయగోదావరి తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై అధికంగా ఉండనుంది. ఈ జిల్లాలన్నీ ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్నాయి. అందుకే ఏపీ ఈపీడీసీఎల్ ఎండి ముందస్తుగానే సమీక్షలు జరిపారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులతో పాటు సిబ్బందిని ఆదేశించారు. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీచేస్తోంది. రెవెన్యూ డివిజన్లో వారీగా కంట్రోల్ రూమ్లు అందుబాటులోకి తేవాలని ఆదేశాలు ఇచ్చింది. మొత్తానికి అయితే తుఫాన్ హెచ్చరికలు ఏపీ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.