AP Heavy Rainfall : ఏపీకి మరో హెచ్చరిక.. స్కూళ్లకు సెలవు.. ప్రభుత్వం హైఅలెర్ట్.. ఏం జరుగుతుందో?

వర్షం అంటేనే ఏపీ వణికి పోతోంది. 45 రోజుల కిందట వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాటి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు మరో భయం వెంటాడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారి.. ఏపీలో తీరం దాటనుంది.

Written By: Dharma, Updated On : October 14, 2024 11:43 am

AP Heavy Rainfall

Follow us on

AP Heavy Rainfall : ఏపీలో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, తుఫాన్ అంచనాల వేళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ తో పాటు నెల్లూరులో వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం ఏర్పడిన 48 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే నెల్లూరు తో పాటుగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు జిల్లాలో అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో అధికారులు ఒక్కసారిగా జాగ్రత్తలు పడ్డారు. మరోవైపు వర్షం ప్రభావిత జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది. 45 రోజుల కిందట భారీ వర్షాలు ఏపీని కుదిపేశాయి.వాటిని మరవకముందే ఇప్పుడు వర్షాలు ప్రారంభం కావడంతో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

* 48 గంటల్లో తుఫానుగా
అల్పపీడనం తదుపరి 48 గంటల్లో బలపడి.. పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నందున.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేశారు.

* ఎడతెరిపిలేని వర్షాలు
నెల్లూరు జిల్లాలో అయితే ఎడతెరిపి లేని వర్షాలు పడుతూనే ఉన్నాయి. వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు.