Bhimavaram cyber fraud: ఆయన పేరు శర్మ. విశ్రాంత ప్రొఫెసర్. ఇటీవల ఆయన ఖాతా నుంచి దశలవారీగా 78 లక్షలు డెబిట్ అయ్యాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయాన్ని మొత్తం చెప్పారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. శర్మ ఇచ్చిన ఆధారాల ప్రకారం కేసు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిసాయి. ఒక్కొక్క లింక్ చేదించుకుంటూ వెళ్లిన పోలీసులకు అసలు దొంగలు దొరికారు.
ఇటీవల కాలంలో సైబర్ నేరస్తులు డిజిటల్ అరెస్ట్ అనే మోసాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.. దీని ద్వారా లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు. ఒక ముఠా లాగా ఏర్పడి.. సైబర్ పోలీసులకు దొరకకుండా.. అమాయకుల ఖాతాల నుంచి డబ్బులు తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతూ అటు ప్రజలకు.. ఇటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.. ఈ తరహా ముఠాకు పోలీసులు గట్టి సమాధానం చెప్పారు.
భీమవరం ప్రాంతానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ శర్మ ఖాతా నుంచి అనేక పర్యాయాలు డబ్బులు డెబిట్ కావడంతో పోలీసులు ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించారు. ఆ తర్వాత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అంతర్జాతీయ డిజిటల్ అరెస్టు ముఠాను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. శర్మ ఖాతా నుంచి డబ్బులు మాయం చేసిన 13 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 42 లక్షలు రికవరీ చేశారు. అదే కాదు వివిధ బ్యాంకులలో ఉన్న 19 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. ఈ ముఠా ప్రధాన సూత్రధారి రహతె జె నయన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ముఠాలో సభ్యులు కార్డ్ డీల్ విధానంలో భారతీయులను మోసం చేస్తున్నారు. భారతీయుల ఖాతాల వివరాలు సేకరించి కంబోడియాకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి ఫోన్లు చేసి డిజిటల్ అరెస్టులు చేస్తున్నామని బెదిరిస్తున్నారు. ఈ ముఠాలో ఏడుగురు గతంలో కాంబోడియాలో పనిచేశారు. ఆ అనుభవంతో ఇక్కడికి వచ్చి మరి కొంతమందిని తన ముఠాలో చేర్చుకొని దోపిడికి పాల్పడుతున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు నయన్ ఐదు సంవత్సరాలుగా కాంబోడియాలో ఉంటున్నాడు. అక్కడి నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. కాంబోడియాలో పనిచేసిన అనుభవంతో బెంగళూరు నగరానికి పుట్ట గుంపుల శ్రీనివాస చౌదరి అనే వ్యక్తి.. హైదరాబాద్ నగరానికి చెందిన బ్లాండిన, శ్రీకాంత్, వంశీ ప్రసాద్, సునీల్ కుమార్, విశాఖపట్నం నగరానికి చెందిన మామిడి వెంకట రోహిణి కుమార్, కూరగాయల ఈశ్వర్, ఖమ్మం నగరానికి చెందిన కమ్మినేని అజయ్, అనంతపురానికి చెందిన తెల్లారి జయచంద్ర కుమార్, నారాయణ బాబు, రాజేష్, సత్య సాయి జిల్లాకు చెందిన పెద్దన్న మంజునాథరెడ్డి, హనుమంత్ రెడ్డి వంటి వారితో ముఠాగా ఏర్పడి ఈ నేరాలకు పాల్పడ్డాడు.
శ్రీనివాస చౌదరి ఆధ్వర్యంలో సైబర్ ముఠా అక్టోబర్ 27న శర్మకు ఫోన్ చేసింది. అక్రమ లావాదేవీలు జరిగాయని ఆయనను బెదిరించింది. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించింది. 13 రోజులపాటు వరుసగా కాల్ చేసి శర్మను ఇబ్బంది పెట్టింది. ఆయన బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి 78.60 లక్షలను మాయం చేసింది. శర్మకు సంబంధించిన నాలుగు ఖాతాల నుంచి ఆరు ఖాతాలకు నిందితులు డబ్బు పంపించారు. వాటి కేవైసీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అనంతపురంలో ఒక ఎకౌంటు నుంచి ఓ వ్యక్తి నగదు తీసుకోవడానికి వచ్చాడు. దీంతో పోలీసులు సిసి ఫుటేజ్ లను పరిశీలించారు. ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ డొంక మొత్తాన్ని లాగారు. అనంతరం ముఠా సభ్యులను పట్టుకొని కటకటాల వెనక్కి పంపించారు.