Free education and Healthcare: ఏపీలో( Andhra Pradesh) మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ప్రారంభం అయింది. ఆగస్టు 15న స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతిరోజు లక్షలాదిమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఐదు రకాల సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అయితే తొలి రెండు రోజులు అంతంత మాత్రంగా ప్రయాణించారు. కానీ గత మూడు రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రకరకాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బస్సుల్లో సీట్ల కోసం మహిళల మధ్య కీచులాటలు బయటపడుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఐదు రకాల బస్సుల్లోనే కాకుండా ప్రీమియర్ బస్సుల్లో సైతం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది.
వైసిపి డిమాండ్లు ఎన్నో..
రాష్ట్ర ప్రభుత్వ( state government) ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. కానీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు కనుక ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సిందే నన్న డిమాండ్ వినిపిస్తోంది. అదే సమయంలో ఇలాంటి దుబారా పథకం ఎందుకు అని కొందరు.. బస్సుల్లో ఉచితం కనుక ఆటోల్లో ప్రయాణించడం లేదని.. ఆటో డ్రైవర్లకు కొంత పరిహారం ఇవ్వాల్సిందేనని.. వారికి నగదు సాయంపై ఒక పథకం ప్రకటించాలని కోరుతూ వస్తున్నారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మహిళల ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి లోపాలను ఎత్తి చూపుతూనే.. ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతోంది. ఈ రెండు విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.
Also Read: అమరావతిపై జగన్ కు అరుదైన ఛాన్స్!
అవే ప్రశ్నలు
అయితే మరి కొంతమంది నెటిజెన్లు ఉచిత ప్రయాణ పథకం పై వింత ప్రశ్నలు వేస్తున్నారు. ఫ్రీ బస్సు( free bus) అంటే అందరూ ప్రయాణించేందుకు ఎగబడుతున్నారని.. మరి ఫ్రీ బడి ఉంది కదా? ఎందుకు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఫ్రీ వైద్యం ఉంది కదా? మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎందుకు వైద్య సేవలు పొందడం లేదని నిలదీసినంత పని చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులు సైతం పెద్దగా రోగులు ఉండడం లేదు. ఉచితంగా విద్యుత్ తో పాటు వైద్యం అందిస్తున్న ప్రజలు స్పందించడం లేదు. ఏమంటే ఆశించిన స్థాయిలో వసతులు లేవని చెబుతున్నారు. కానీ ఫ్రీ బస్సు అనేసరికి డొక్కు బస్సుల్లో సైతం కష్టం మీద ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అదనపు బస్సులు వెయ్యమని. కానీ అక్కడ ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నా తమ పిల్లలను పంపించడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరిచినా ముఖం చాటేస్తున్నారు. ఫ్రీ బస్ అనేసరికి కిక్కిరిసి ప్రయాణించి మరీ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఇదే అంతటా చర్చ నడుస్తోంది.