Amaravati CRDA Office: అమరావతి( Amravati capital ) సరికొత్త సంచలనాలకు వేదికగా మారుతోంది. ఈరోజు అమరావతి లోని సచివాలయ ప్రాంగణంలో 16,000 మందికి పైగా ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు, వారి కుటుంబ సభ్యులు అమరావతి చేరుకున్నారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను ఎక్కువమంది పరిశీలించారు. ఈ కార్యక్రమంతో అమరావతి పునర్నిర్మాణ పనుల గురించి, అక్కడ ప్రగతి గురించి మరింత ప్రచారం జరగనుంది. సాధారణంగా విద్యాధికులు, ఉద్యోగులు కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారీ డీఎస్సీ నియామకంతో అభ్యర్థులు సైతం సంతృప్తితో ఉన్నారు. కచ్చితంగా వారు అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో సానుకూల ప్రచారం చేస్తారని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అమరావతి కేంద్రంగా నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది.
* అందుబాటులోకి భవనం..
ప్రస్తుతం అమరావతిలో సిఆర్డిఏ కార్యాలయం( crda office) అందుబాటులోకి వచ్చింది. దసరాకు ఈ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అడుగడుగునా ఆధునిక నిర్మాణ శైలి, ఆకట్టుకునే ఇంటీరియర్స్, సిబ్బంది కోసం వర్క్ స్టేషన్లు.. ఇలా సకల సౌకర్యాలతో సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం సిద్ధమవుతోంది. సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన.. రాయపూడి సమీపంలో ఈ భవనం దాదాపు పూర్తయింది. అమరావతిలో నియామక పత్రాలు అందుకునేందుకు వచ్చిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మిగతా నిర్మాణాలను సైతం చూస్తున్నారు.
* ప్రతి విభాగము ప్రత్యేకమే
అమరావతి రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షించేది సిఆర్డిఏ. అటువంటి విభాగానికి ప్రత్యేక భవనం ఉండాలని భావించింది టిడిపి ప్రభుత్వం. సిఆర్డిఏ ప్రాజెక్టు కార్యాలయ పనులు ప్రారంభించింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. కానీ 2024 ఎన్నికల కు ముందు వైసీపీ ప్రభుత్వం హడావిడి చేసింది. కానీ పూర్తి చేయలేకపోయింది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పునర్నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఎక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. పది నమూనాలు తయారు చేసి వెబ్సైట్లో ఉంచారు. ప్రజల నుంచి ఓటింగ్ కోరారు. ఎక్కువమంది ఏ నమూనాకు ఓటు వేశారో దాని ప్రకారం భవనం ఎలివేషన్ రూపొందించారు. కార్యాలయ ముఖద్వారానికి సంబంధించి లైటింగ్ డిజైన్ సైతం ఓటింగ్ పెట్టారు. అయితే సి ఆర్ డి ఏ భవనం లో ప్రతి విభాగం ప్రత్యేకమైనదే. కార్యాలయం ముందు భాగంలో ఎత్తైన జాతీయ జెండా పోస్ట్ ఏర్పాటు చేశారు. శబ్దాన్ని నియంత్రించేందుకు అంతర్గతంగా బాఫీల్ సీలింగ్ నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనం అమరావతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ దసరాకు భవనం ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకునేందుకు వెళ్తున్నవారు భవనాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.