CPI Narayana targeted Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( AP deputy CM Pawan Kalyan)సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థను కావాలని కోరిన సంగతి తెలిసిందే. దేశంలో ఇతర మతాల మాదిరిగానే హిందూ ధర్మ పరిరక్షణకు బలమైన స్వతంత్ర వ్యవస్థ కావాలని కోరారు. అయితే దీనిని ప్రకాష్ రాజ్ లాంటి వారు తప్పుపట్టారు. తమిళనాడు నేతల నుంచి ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయి. అయితే ఇప్పుడు సిపిఐ నారాయణ సైతం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన వైవాహిక జీవితం పై మాట్లాడుతూ.. సనాతన ధర్మం లో విడాకులు అనే మాటకు తావు ఉండదని చెబుతున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి పని చేశారు. 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. అప్పట్లో సిపిఐ నారాయణ తో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే సిపిఐ నారాయణ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.
వ్యూహం మార్చిన పవన్..
అయితే పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని మార్చినట్టు స్పష్టమవుతోంది. తనది కమ్యూనిస్టు( communist) భావజాలం అని పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు. అయితే ఆ భావజాలంతో ఎన్నికలకు వెళితే.. వామపక్షాలతో కలిసి పోటీ చేస్తే జనాలు గుర్తించలేదు. ఎప్పుడైతే సనాతన ధర్మం, బిజెపి రూట్లోకి వెళ్లారు పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా సక్సెస్ అయ్యారు. 2019 ఎన్నికల ఫలితాల తరువాత జగన్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. వామపక్షాలతో వెళితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి వెంటనే బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఇది ఎంత మాత్రం వామపక్షాలకు రుచించలేదు. అందుకే ఆయన వామపక్షాల నేతలకు టార్గెట్ అవుతున్నారు.
బిజెపితో సైద్ధాంతిక విభేదం
బిజెపి ( Bhartiya Janata Party) వైఖరికి పూర్తిగా భిన్నం వామపక్షాలు. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత వామపక్షాల హవా తగ్గింది. ఒక పార్టీ ఎదుగుదలకు వామపక్షాలు దోహదపడటం లేదు. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. అయితే ఏపీలో వామపక్ష భావజాలం ఇప్పటికీ ఉంది ప్రజా ఉద్యమాల రూపంలో. ప్రతిపక్షంలో ఉన్నవారికి మాత్రమే వామపక్షాల అవసరం ఉంటుంది. అధికారంలోకి వచ్చాక ప్రజా ఉద్యమాల రూపంలో అధికార పార్టీకి వామపక్షాలు ఎప్పుడు వ్యతిరేకమే. కానీ చంద్రబాబు సీఎం గా ఉన్నారు. ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. కానీ ఆయనను మాత్రం టార్గెట్ చేయడం లేదు వామపక్ష నేత నారాయణ. పవన్ కళ్యాణ్ విషయంలోనే టార్గెట్ చేస్తున్నారు. ప్రధాని మోదీ డైరెక్షన్లోనే పవన్ వెళ్తున్నారన్నది నారాయణ అనుమానం. అన్నింటికీ మించి తమను విడిచిపెట్టి బిజెపి చెంత పవన్ చేరడాన్ని నారాయణ తట్టుకోలేకపోతున్నారు. అయితే నారాయణ వైఖరి చూస్తుంటే చంద్రబాబు విషయంలో ఏమీ అనడం లేదు.. పవన్ విషయంలో మాత్రం తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం పెరుగుతోంది.