https://oktelugu.com/

Inter Admissions : ఇంటర్ అడ్మిషన్లు : జగన్ నిర్ణయం వెనుక ‘కార్పొరేట్ శక్తులు’?

జూన్ వరకూ ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టవద్దంటూ ఏపీ సర్కారు ఆదేశాలిచ్చింది. దీనిపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పిల్లలను ఏ కాలేజీలో చేర్పించాలన్న ఆతృతతో ఎదురుచూసే తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : April 27, 2023 / 10:39 AM IST
    Follow us on


    Inter Admissions :
    ఎలుక దూరిందని ఇంటినే కాల్చేయ్యమన్నట్టుంది ఏపీ ప్రభుత్వ వైఖరి. కార్పొరేట్ కాలేజీలను నియంత్రించాలన్న ఉద్దేశ్యంతో ఏకంగా ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది. మే రెండో వారంలో పరీక్ష ఫలితాల విడుదలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే జూన్ వరకూ ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టవద్దంటూ ఏపీ సర్కారు ఆదేశాలిచ్చింది. దీనిపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పిల్లలను ఏ కాలేజీలో చేర్పించాలన్న ఆతృతతో ఎదురుచూసే తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయమంటూ చెబుతోంది.

    అవన్నీ చేస్తే ఎలా?
    అటు అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన వంటి వాటి విషయంలో కూడా ఏపీ సర్కారు సరైన మార్గదర్శకాలు పాటించడం లేదు. కార్పొరేట్ కాలేజీల్లో చదువుకున్న వారికి సైతం వీటిని వర్తింపజేసింది. తద్వారా కార్పొరేట్ సెక్షన్ కు ప్రోత్సహించినట్టయ్యింది. కేవలం అడ్మిషన్ల నిలిపివేత ద్వారా ఎలా నియంత్రణ సాధ్యమో ప్రభుత్వానికే ఎరుక. ప్రభుత్వ కాలేజీల్లో సరైన వసతులు లేవు. అధ్యాపకులు లేరు. గత కొన్నేళ్లుగా కొత్త పోస్టుల భర్తీ లేదు. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ గా విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది. కానీ అవేవీ చేయకుండా కేవలం అడ్మిషన్లు నిలిపివేస్తే కార్పొరేట్ కాలేజీలకు అడ్డుకట్ట వేయవచ్చన్నది భ్రమగానే మిగులుతుంది.

    ఎప్పుడు ఏ నిర్ణయాలుంటాయో…
    విద్యాశాఖ విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు విమర్శలకు దారితీస్తున్నాయి. ‘నాడునేడు’ పనులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ కు ధీటుగా మార్చనున్నట్టు జగన్ సర్కారు ప్రకటించింది. అందుకు తగ్గట్టు పనులు కూడా చేపట్టింది. అయితే పాఠశాలల విలీన ప్రక్రియతో చాలావరకూ స్కూళ్లు మూతపడ్డాయి. లక్షలాది రూపాయలు వృథా అయ్యాయి. ఉపాధ్యాయుల సర్దుబాటుతో సిబ్బంది కొరత తీరినా..విలీన ప్రక్రియతో వసతి సమస్య ఏర్పడింది. అలాగని విలీనమైన పాఠశాల భవనాలు వృథాగా మారాయి. అటువంటప్పుడు లక్షలాది రూపాయలతో నాడునేడు పనులు చేపట్టడం కూడా విమర్శలకు దారితీస్తోంది. అనవసరంగా ప్రజాధనాన్న వృథా చేశారన్న టాక్ నడుస్తోంది.

    ఏటా ఇదే పరిస్థితి
    వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఏటా అడ్మిషన్ల విషయంలో జఠిలం జరుగుతునే ఉంది. గత మూడేళ్లుగా అడ్మిషన్ల విషయంలో ఏదో ఒక ప్రయోగం చేయడం రివాజుగా మారింది. ఎంసెట్ తరహాలో ఆన్ లైన్ లో అడ్మిషన్లు నిర్వహించడం…అడ్మిషన్లలో ఆప్షన్లు ఇవ్వడం కూడా గందరగోళానికి కారణమైంది. అయితే అడ్మిషన్లపై కోర్టు స్పందించిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితినే ఏపీ సర్కారు ఏరికోరి తెచ్చుకుంది. కార్పొరేట్ కాలేజీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సింది పోయి.. ఏకంగా ఇంటర్ అడ్మిషన్లు నిలిపివేయాలని ఆదేశాలివ్వడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.