YCP: వైసీపీలో అభ్యర్థుల మార్పు వివాదం రాజు కుంటోంది. ఎక్కడికక్కడే నేతల అనుచరులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. హై కమాండ్ తీరును తప్పుపడుతున్నారు. ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు తెగ బాధపడుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన ఆళ్లను తప్పించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. అటు ఆళ్ల సైతం వైసిపి హై కమాండ్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండడం విశేషం. తన మార్పును ముందే గమనించిన ఆయన ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం ఎటువంటి చేయూతనివ్వలేదని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్ణయించడం మాత్రం ఆసక్తి రేపుతోంది. అంటే అక్కడ ప్రత్యర్థిగా ఉన్న లోకేష్ కు ప్రయోజనం చేకూరినట్టే. తన నమ్మకాన్ని వమ్ము చేసిన పార్టీకి గుణపాఠం నేర్పాలి అన్నది ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యూహంగా తేలుతోంది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సైతం ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిన విడుదల రజినీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. అక్కడ ఎమ్మెల్యే గా ఉన్న మద్దాలి గిరిధర్ ను పక్కకు తప్పించారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన గిరిధర్ వైసీపీలోకి ఫిరాయించారు. ఇప్పుడు ఆయన తప్పించడంతో అనుచరులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. టిడిపి నుంచి వైసీపీలోకి ఫిరాయించిన గిరిధర్ కు మంచి గుణపాఠమే దక్కిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాగా విడదల రజిని నియామకాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్యవైశ్యులు ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపడుతున్నారు. మద్దాలి గిరికే గుంటూరు పశ్చిమ సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలే కాదు.. మున్ముందు చాలా నియోజకవర్గాల్లో ఈ తరహా ఆందోళనలు, నిరసనలు ముమ్మరం కానున్నట్లు తెలుస్తోంది.