https://oktelugu.com/

AP Congress: కాంగ్రెస్ ఆపరేషన్ ప్రారంభం.. ఏపీలో పుంజుకుంటుందా?

వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. గాంధీ కుటుంబం పట్ల వీర విధేయత కనబరుస్తూ వచ్చారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ కు సీఎం పదవి ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో వైఎస్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. రాజశేఖర్ రెడ్డి పేరిట జగన్ పార్టీ పెట్టడంతో సంపూర్ణ మద్దతు తెలిపారు. అటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం జగన్ ను ఆదరించారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 9, 2024 10:53 am
    AP Congress

    AP Congress

    Follow us on

    AP Congress: అమరావతి: ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వైసిపి దారుణ పరాజయంతో కొత్త లెక్కలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునేందుకు పావులు కదపడం ప్రారంభించింది. ఇప్పటికే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలకు పీసీసీ పగ్గాలు అందించారు. ఆమె సైతం యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఎన్నికల్లో ఆమె కడప లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 1,50,000 కు పైగా ఓట్లను సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా బలమైన అభ్యర్థులను ఈసారి బరిలో దించగలిగారు. ఓటు శాతం కూడా ఆ పార్టీ పెంచుకోగలిగింది. వైసిపి ఓటమితో బలపడే ఛాన్స్ దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. అందుకు ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. నిన్న జరిగిన వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది. ‘వైఎస్ఆర్’ కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా చెప్పుకునే ప్రయత్నాలు చేసింది.

    * చివరి వరకు వైయస్సార్ కాంగ్రెస్ లోనే..
    వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. గాంధీ కుటుంబం పట్ల వీర విధేయత కనబరుస్తూ వచ్చారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ కు సీఎం పదవి ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో వైఎస్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. రాజశేఖర్ రెడ్డి పేరిట జగన్ పార్టీ పెట్టడంతో సంపూర్ణ మద్దతు తెలిపారు. అటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం జగన్ ను ఆదరించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. వైసీపీలో ఉన్న సీనియర్లు, క్యాడర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుల ద్వారా పార్టీని బలోపేతం చేయాలన్నది కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్లాన్.

    * ప్రత్యామ్నాయ వేదికగా వైసిపి..
    2014లో రాష్ట్ర విభజన జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విభజనకు అంగీకరించింది. ఇది ఏపీ ప్రజలకు శాపంగా మారింది. వారి ఆగ్రహానికి కారణమైంది. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా జగన్ నేతృత్వంలోని వైసీపీ ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీలోనే మెజారిటీ నాయకులు, క్యాడర్ వైసీపీలో చేరిపోయారు. దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ.. 2014, 2019 ఎన్నికల్లో కనీసం ఉనికి చాటుకోలేకపోయింది. అభ్యర్థులను పోటీలో పెట్టడానికి కూడా సాహసించలేకపోయింది. కానీ ఈ ఎన్నికల్లో షర్మిల రూపంలో ఒక నాయకత్వం దొరికింది. పోటీ చేసేందుకు ఔత్సాహికులు కూడా ముందుకు వచ్చారు. అయితే ఓటు శాతం పెరిగినా.. ఒక్క సీటు కూడా దక్కకపోవడం విశేషం. మరోవైపు ఇన్నినాళ్ళు కాంగ్రెస్ శ్రేణులకు పునరావాస కేంద్రంగా ఉన్న వైసీపీ సైతం దారుణంగా ఓడిపోయింది. జీర్ణించుకోలేని ఓటమి ఎదురైంది. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్లు తేలింది. షర్మిల రూపంలో బలమైన నాయకత్వం దొరకడం, జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం, వైసీపీకి దారుణ పరాజయం ఎదురు కావడంతో.. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేందుకు ఇదే సరైన సమయమని అగ్ర నాయకత్వం భావిస్తోంది. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని ప్రయోగించింది. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరయ్యేలా చూసింది. ప్రస్తుతానికి వైసీపీ నేతలు ప్రాథమిక చర్చలు జరుపుతున్నారని.. త్వరలో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం దిశగా అడుగులేస్తోందన్నమాట. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.