Bandla Ganesh Padayatra: బండ్ల గణేష్( bandla Ganesh) ఎవరికి అంతుపట్టరు. ఆయనను అర్థం చేసుకోలేం కూడా. అయితే తాజాగా అయిన తన నివాసం షాద్ నగర్ నుంచి తిరుపతికి పాదయాత్ర మొదలుపెట్టారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆయన విడుదల కావాలని మొక్కుకున్నారు. దానిని ఇప్పుడు తీర్చుకుంటున్నారు. ఈరోజు షాద్ నగర్ లో పాదయాత్ర మొదలుపెట్టారు. దాదాపు 450 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి తిరుమల స్వామివారిని దర్శించుకొనున్నారు. మొక్కు చెల్లించుకొనున్నారు. ఈరోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. తన పాదయాత్రను రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి చేశారు. కేవలం చంద్రబాబు పై ఉన్న అభిమానంతోనే తాను పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నటుడు శివాజీ పాల్గొన్నారు.
స్ట్రాంగ్ గా రియాక్ట్..
వాస్తవానికి చంద్రబాబు( CM Chandrababu) అరెస్టు సమయంలో బండ్ల గణేష్ చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నేతగా చంద్రబాబును అభివర్ణించారు. అటువంటి నాయకుడి అరెస్టును తప్పుపట్టారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు ప్రజలు ఉండే ప్రాంతాల్లో సైతం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఒక విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి అప్పుడే బీజం పడింది. అయితే అప్పట్లో చంద్రబాబు అరెస్టుపై బండ్ల గణేష్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యేసరికి భారీగా హైప్ లభించింది. ప్రజల్లోకి బలంగా ఈ అంశం వెళ్ళింది. 52 రోజుల తర్వాత చంద్రబాబు అరెస్టయ్యారు. ఆ సందర్భాల్లో బండ్ల గణేష్ భావోద్వేగ ప్రకటనలు చేశారు.
జనసేనకు అండగా..
జనసేన ( janasena ) ఆవిర్భావ సమయంలో ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు బండ్ల గణేష్. ముఖ్యంగా టీవీ డిబేట్లో జనసేనకు అనుకూలంగా వ్యాఖ్యానాలు చేసేవారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలంగా సమర్థించే వారు. అయితే అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో పోటీ చేయాలని భావించారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని శపధం చేశారు. అయితే అప్పట్లో బండ్ల గణేష్ జోష్యం ఫలించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చూశారు అవకాశం చిక్కలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉంటూ చంద్రబాబు పై అభిమానంతో ఈ పాదయాత్ర చేస్తున్నారు. దీనిపై రాజకీయ విమర్శలు చేయవద్దని కోరుతున్నారు. అయితే బండ్ల గణేష్ పాదయాత్ర వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కానీ చంద్రబాబు పై ఉన్న అభిమానంతోనే ఈ పాదయాత్రకు దిగారని అనుచరులు చెబుతున్నారు. మరి ఏది నిజమో చూడాలి.
