AP Congress: కాంగ్రెస్ పార్టీ ( Congress Party) సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దేశవ్యాప్తంగా పార్టీ ప్రాబల్యం తగ్గుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ బలం పెరిగిందని అంతా భావించారు. కానీ ఆ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఓడిపోతూ వస్తోంది. బీహార్లో అయితే దారుణ ఫలితాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మార్పుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అదే సమయంలో ప్రతి రాష్ట్రంలో బలమైన నాయకత్వాన్ని ముందుకు తేవాలన్న ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఏపీ ఫై కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అనుకున్న స్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. దీనిని గుర్తించిన హైకమాండ్.. త్వరలో నాయకత్వం మార్పునకు సిద్ధ పడుతోందన్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఈసారి ముందు పెట్టి రాజకీయం చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. ఓ కాపు ప్రముఖుడి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
* ప్రత్యామ్నాయంగా అవతరించాలని..
ప్రస్తుతం టిడిపి( Telugu Desam Party) కూటమిలో పవన్ కళ్యాణ్ కీలక భాగస్వామిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పవన్ పిలుపుతో కాపులు టిడిపి కూటమి వైపు టర్న్ అయ్యారు. అయితే వైసీపీలో ఉన్న చాలామంది కాపు నేతలకు వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఎన్ని సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా పార్టీలోనే కొనసాగుతున్నారు. అటువంటి వారంతా ఇప్పుడు వంగవీటి మోహన్రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణకు పార్టీ బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా విజయవాడకు చెందిన మాజీ ఎంపీ ఒకరు హై కమాండ్ కు నివేదించినట్లు సమాచారం. వంగవీటి రాధాకృష్ణకు కాంగ్రెస్ పగ్గాలు ఇస్తే వర్కౌట్ అవుతుందని సూచన చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలన్నది టిడిపి కూటమి లక్ష్యంగా తెలుస్తోంది. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయవచ్చు అన్నది ఒక ఆలోచనగా సమాచారం. అందుకే ఆ మాజీ ఎంపీ ని రంగంలోకి దించారని కూడా ఒక రకమైన ప్రచారం జరుగుతోంది.
* ఆది నుంచి కాంగ్రెస్ లోనే.. వంగవీటి( vangaveeti) ఫ్యామిలీ ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చింది. 1985లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు వంగవీటి మోహన్ రంగ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు సేన పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు వంగవీటి మోహన్ రంగ. ఉమ్మడి రాష్ట్రం నుంచి లక్షలాదిమంది కాపులు తరలివచ్చారు ఆ సభకు. అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వంగవీటి మోహన్రంగా పేరు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే 1988లో రంగ దారుణ హత్యకు గురయ్యారు. 1989లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఇదొక కారణంగా నిలిచింది. అప్పటినుంచి వంగవీటి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చింది.
* చిన్న వయసులోనే అసెంబ్లీకి..
2003లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. మోహన్ రంగా కుమారుడు రాధాకృష్ణను పిలిచి కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన రాధాకృష్ణ చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల కు ముందు టిడిపిలో చేరారు కానీ టికెట్ దక్కలేదు. 2024 ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. కానీ యాక్టివ్ గా లేరు. ప్రస్తుతం ఆయన పేరు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా వినిపిస్తోంది. తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.