YS Sharmila And JAGAN: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్.షర్మిల. 2019 వరకు కలిసి పనిచేశారు. కాంగ్రెస్‌ను విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి ఇద్దరూ పాదయాత్ర చేశారు. జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీ బాధ్యతను షర్మిల చూసుకున్నారు. ఇద్దరి కష్టంలో 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఎందుకు పెరిగింది అనేది ఇప్పటికీ ఎవరూ బయటపెట్టలేదు. కానీ, పదవుల కోసమే అన్న ప్రచారం జరిగింది. చివరకు షర్మిల అన్నను విభేదించి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుంది. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. కానీ, కాంగ్రెస్‌తో మంతనాలు జరిపి చివరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసింది. దీంతో తెలంగాణ ఎన్నికల తర్వాత షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలయ్యారు. కానీ, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీతరఫున పోటీ చేసిన ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేకపోయారు. చివరకు తాను కూడా కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ, అన్న జగన్‌కు చెందిన అధికార వైసీపీ ఓటమిలో కీలకపాత్ర పోషించారు. తీవ్రస్థాయిలో షర్మిల జగన్‌పై యాంటీ ప్రచారం చేశారు. ఇక, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా.. రాష్ట్రంలో ఏం జరిగినా దాని ని జగన్ పాలనకు అంటగట్టి విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ విమర్శలకు, టార్గెట్‌కు కారణం.. వారసత్వపు ఆస్తుల పంపకాల్లో వచ్చిన తేడాలే కారణమన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ.
మౌనంగా విజయమ్మ..
ఈ విషయంలో జగన్, షర్మిల తల్లి విజయమ్మ కూడా ఏమీ చేయలేక పోయారన్న వాదన ఉంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ ను తమకు ఇచ్చేయాలన్నది షర్మిల డిమాండ్ చేస్తున్నారని ఏడాది కాలంగా చర్చనడుస్తోంది. ఈ విషయంలో జగన్ పంతానికి పోయారని.. దానిని ఇచ్చేది లేదని తేల్చి చెప్పారని కూడా కొన్నాళ్లు విశ్లేషణలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు లోటస్‌పాండ్ షర్మిల వశం అయినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. షర్మిల తనపై దూకుడు తగ్గిస్తేనే తప్ప.. రాజకీయంగా తాను పుంజుకునే పరిస్థితి లేదనిజగన్ భావించారని వైసీపీకి చెందిన అత్యంత విశ్వసనీయ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులతో పోరాటం చేయొచ్చు కానీ.. సొంత వారే పగవారై.. సూటి పోటి మాటలతో విమర్శలు గుప్పిస్తే.. ఎలా అన్నది జగన్ మాటగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన ఓ సీనియర్ రాజకీయ నేత, వైఎస్ కుటుంబంతో అతి దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి ద్వారా.. మంత్రాంగం జరిగినట్టు తెలుస్తోంది.
లోటస్‌పాండ్ వదులుకున్న జగన్..
రాజీ చర్చల్లో హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌ను జగన్ వదులుకున్నారన్నది తాజాగా తెలిసిన విషయం. ఈ పరిణామాలతోనే షర్మిల.. తగ్గుతున్నారని.. అన్నను టార్గెట్ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. దీనిలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. మూడు రోజుల కిందట కూడా.. జగన్‌ను షర్మిల దుయ్యబట్టారు. ప్రాజెక్టులను సరిగా నిర్వహించనందుకే.. బుడమేరు పొంగి.. ఊళ్లు నీట మునిగాయని ఆమె ఆరోపించారు.