District Collector Son Government School: సామాన్య మధ్యతరగతి కుటుంబాల వారు సైతం ఇప్పుడు ప్రైవేటు పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పిస్తున్నారు. అటువంటిది ఓ జిల్లా కలెక్టర్ తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. పార్వతీపురం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. అయితే ఇదేదో కొత్తగా కాదు. ప్రాథమిక స్థాయి నుంచి అతని కుమారుడు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాడు. సాధారణంగా కలెక్టర్లకు బదిలీ అవుతూ ఉంటుంది. అయితే తాను ఎక్కడికి బదిలీ పై వెళ్ళినా.. అక్కడే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల అభిప్రాయం మారుతోంది. పెద్ద ఎత్తున ప్రైవేటు పాఠశాలల నుంచి కూడా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇది మంచి మార్పు కూడా.
* పార్వతీపురం పాఠశాలలో..
పార్వతీపురం జిల్లా కలెక్టర్గా ఎన్ ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆయన నియమితులయ్యారు. ప్రభాకర్ రెడ్డి కుమారుడు క్రిష్ ధరణ్ రెడ్డి విజయవాడలోని పడమట జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తి చేశాడు. ప్రభాకర్ రెడ్డికి పార్వతీపురం బదిలీ కావడంతో ఈ ఏడాది పదో తరగతి డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతిలో చేర్పించారు. నిజంగా ఇది గొప్ప విషయం. కలెక్టర్ కుమారుడు తమ పాఠశాలలో చేరడంతో తమ బాధ్యత మరింత పెరిగిందని అక్కడ ప్రధానోపాధ్యాయుడు తో పాటు ఉపాధ్యాయులు చెబుతున్నారు. గతంలో పార్వతీపురం ఐటీడీఏ పీవోగా పనిచేసిన కూర్మనాద్ కూడా తన కుమారుడిని ఇదే డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ పాఠశాలలో చదివించారు.
* బదిలీ జరిగినా..
సాధారణంగా కలెక్టర్లు ఒకే చోట ఉండరు. బదిలీలు అనేది వారికి సర్వసాధారణం. ప్రభాకర్ రెడ్డి శాప్ ఎండి గా పని చేశారు. అప్పట్లో తన ఇద్దరు పిల్లలను విజయవాడ పడమట జడ్పి ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అంతకుముందు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేసిన సమయంలో సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారు. సాధారణ తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆలోచిస్తున్న ఈ రోజుల్లో.. ఒక జిల్లా కలెక్టర్ తన కుమారుడిని సర్కారు బడిలో చదివించడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని అభినందించారు. కాగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ముస్తాబు కార్యక్రమాన్ని ప్రభాకర్ రెడ్డి ముందుగా ప్రవేశపెట్టారు. కలెక్టర్ల సదస్సులు ఇదే విషయాన్ని చెప్పి సీఎం చంద్రబాబు సైతం అభినందనలు తెలిపారు.
