Collector Shan Mohan : ఆయన ఓ జిల్లా కలెక్టర్. కానీ నిండు సభలో కన్నీటి పర్యంతమయ్యారు. ఉపాధ్యాయుల వృత్తి ధర్మం ఎంత గొప్పదో చెబుతూ ఎమోషన్ అయ్యారు. నిబద్ధతతో పనిచేయకపోతే భావితరాలకు ఎంత నష్టమో వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కొంచెం ఎమోషనల్ తో కంటతడి పెట్టారు. కాకినాడలో జరిగింది ఈ ఘటన. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సభను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ షాన్ మోహన్ హాజరయ్యారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల గురించి చక్కగా వివరించారు. పిల్లలను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తేల్చి చెప్పారు. వారు ఎంతో నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని పాటించాలన్నారు. తన తల్లిదండ్రులు ఉపాధ్యాయులేనని.. వారు వృత్తి ధర్మంతో ఉత్తమ ఉద్యోబోధన అందించారని.. అందుకే తాము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకొచ్చారు. కొంతమంది విద్యార్థులు చేజేతులా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని గుర్తు చేశారు. అదే సమయంలో కొంతమంది ఉపాధ్యాయుల తీరు సరిగా లేదని చెప్పుకొచ్చారు. వారే విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తున్నారని చెప్పారు. ఒకవేళ వారు సక్రమంగా విధులు నిర్వహించక పోయి ఉంటే ఆ పాపం తమకు తగిలేదంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. కలెక్టర్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
* ఉపాధ్యాయుడు పాత్ర కీలకం
ఓ విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడు పాత్ర కీలకంగా చెప్పుకొచ్చారు. కానీ కొందరు ఉపాధ్యాయుల తీరు సరిగా లేదన్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లకు వెళ్లలేమని కొందరు ఉపాధ్యాయులు చెబుతున్నారని.. రాజకీయ సిఫారసులతో పోస్టింగులు ఇప్పించుకుంటున్నారని గుర్తు చేశారు. అటువంటి సమయంలోనే చాలా బాధ అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. విద్యార్థికి విద్యాబోధన అందించేందుకే ప్రభుత్వం పాఠశాలలను ఏర్పాటు చేసిందని.. అక్కడ ఉత్తమ విద్యా బోధనను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
* తప్పుగా అనుకోవద్దు
అయితే తాను ఎవరిని తప్పుగా ఉద్దేశించి అనలేదని.. వ్యవస్థలో నెలకొన్న లోపాలపై మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. ఇలాంటి సభల్లో తాను ఎక్కువగా మాట్లాడనని.. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మాట్లాడుతున్నట్లు తెలిపారు. కాగా ఒక జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయుల తీరుపై ఆక్షేపించడం చర్చకు దారితీస్తోంది. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.