CM Chandrababu : వైసీపీకి మరో షాక్ తగిలింది. గత 60 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీకి బ్రేక్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీ పిఎసి చైర్మన్ పదవి విషయంలో వైసీపీకి షాక్ ఇస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షానికి దక్కే ఆ పదవిని ఈసారి జనసేనకు ఇవ్వాలని భావిస్తోంది. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడమే ఈ నిర్ణయానికి కారణం. జనసేన నుంచి భీమవరం ఎమ్మెల్యే ఆంజనేయులు పేరు వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన పేరు ప్రకటన లాంఛనమేనని తెలుస్తోంది. వాస్తవానికి ఈ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ. కానీ వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. అసెంబ్లీలో కనీసం 18 మంది సభ్యులు ఉంటేనే హోదా దక్కేది. పీఏసీ చైర్మన్ తో పాటు కమిటీలకు సంబంధించి ఈరోజు నామినేషన్లు స్వీకరించారు. వైసీపీ నుంచి అసెంబ్లీ కోటాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మండలి నుంచి మరో ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నిబంధనలతో పని లేకుండా వైసీపీకి ఆ పదవి కేటాయిస్తారని.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియారిటీని గౌరవించి చైర్మన్గా ప్రకటిస్తారని ప్రచారం సాగింది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో ట్విస్ట్ చోటుచేసుకుంది.
* కూటమి నుంచి నామినేషన్లు
పీఏసీ చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులకు సంబంధించి కూటమి నుంచి నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 12 స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్ల పైనే ఓటింగ్ జరగనుంది. శాసనసభలో వైసిపికి బలం లేకపోవడంతో పెద్దిరెడ్డికి అవకాశం దక్కేలా లేదు. అయితే శాసనమండలిలో బలం ఉండడంతో వైసిపికి ఇద్దరు సభ్యులకు అవకాశం దక్కనుంది. అయితే టిడిపి తర్వాత ఎక్కువ సీట్లు దక్కించుకున్న జనసేనకు పిఎసి చైర్మన్ పోస్టు కేటాయించి అవకాశం కనిపిస్తోంది.
* పవన్ విన్నపం మేరకు
స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ పదవులను టిడిపి తీసుకుంది. అటు తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన పిఎసి చైర్మన్ మాత్రం తమకు విడిచి పెట్టాలని పవన్ అడిగినట్లు తెలుస్తోంది. అందుకు చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముందుగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. కానీ అదే జిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. అందుకే భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ఆయన ఎన్నిక లాంఛనం గా మారింది. అయితే రామాంజనేయులు గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేసిన వారే. ఎన్నికలకు ముందు జనసేనలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు పిఎసి చైర్మన్ గా పదవి దక్కించుకోనున్నారు.