Botsa vs Gudivada Amarnath
Botsa vs Gudivada Amarnath : ఉత్తరాంధ్ర ( North Andhra)వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయా? ముఖ్యంగా విశాఖలో బొత్స వెర్సెస్ గుడివాడ అన్నట్టు పరిస్థితి మారిందా? బొత్స విశాఖ రాకను గుడివాడ అమర్నాథ్ వ్యతిరేకిస్తున్నారా? విశాఖలో మీ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం రెండు చోట్ల విజయం సాధించింది. శ్రీకాకుళం తో పాటు విజయనగరంలో కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. అయినా సరే వైసీపీ గుణపాఠం నేర్వలేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో సీనియర్లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. ఇప్పటికే మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. ధర్మాన ప్రసాదరావు సైలెంట్ అయ్యారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పూర్తి అసంతృప్తితో గడుపుతున్నారు. అయితే మాజీ మంత్రుల్లో గుడివాడ అమర్నాథ్ తో పాటు బొత్స సత్యనారాయణ యాక్టివ్ గా ఉన్నారు. కానీ వారి మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది.
* అనూహ్యంగా ఎమ్మెల్సీగా బొత్స
ఈ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ(botsa Satyanarayana) చీపురుపల్లి నియోజకవర్గంలో ఓడిపోయారు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఉప ఎన్నిక జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన బొత్స సత్యనారాయణ గెలిచారు. కేవలం కూటమి దూకుడు తనం ప్రదర్శిస్తుందని.. బొత్స అయితే సరిపోతారని భావించి ఆయనను రంగంలోకి దించింది వైసిపి. అయితే కూటమి అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంది. దీంతో బొత్స కు లైన్ క్లియర్ అయింది. అయితే జిల్లాలో తామంతా ఉండగా బొత్సను ఎంపిక చేయడం ఏంటనేది గుడివాడ అమర్నాథ్ భావన. అప్పటినుంచి బొత్స రాకను వ్యతిరేకిస్తున్నారు గుడివాడ అమర్నాథ్.
* చివరి నిమిషంలో సీటు
ఈ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath). 2019 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. మంత్రిగా కూడా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ ను అక్కడ నుంచి తప్పించారు. కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇచ్చారు. చివరి నిమిషంలో గుడివాడ అమర్నాథ్ కు గాజువాకను సర్దుబాటు చేశారు. అక్కడ అమర్నాథ్ కు దారుణ పరాజ్యం ఎదురయింది. అయితే తనకు గాజువాక సూట్ కాదని.. భీమిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని గుడివాడ అమర్నాథ్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరారు. అయితే ఇక్కడ కూడా బొత్స అడ్డు తగిలినట్లు తెలుస్తోంది. తెరపైకి తన మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును తెరపైకి తీసుకొచ్చారు.
* ఇష్టం లేని చోట బాధ్యతలు
అయితే గుడివాడ అమర్నాథ్ కు చోడవరం బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఇన్చార్జిగా ఉన్న కరణం ధర్మశ్రీని( karanam dharmashree ) అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి తీసుకొచ్చారు. ఈ నిర్ణయం ధర్మశ్రీ కి మింగుడు పడలేదు. తన స్థానంలో వచ్చిన గుడివాడ అమర్నాథ్ కు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో గుడివాడ అమర్నాథ్ సైతం అయీష్టత గానే చోడవరం వెళ్లారు. అయితే పక్క జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ తీరుతోనే ఇదంతా జరుగుతోందన్న అనుమానం గుడివాడ అమర్నాథ్ లో ఉంది. అందుకే ఆయనతో విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. మున్ముందు విశాఖ వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.