Nagarjuna gives shock to Jagan
Akkineni Nagarjuna : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి( Jagan Mohan Reddy) హీరో నాగార్జున షాక్ ఇచ్చారా? తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. రెండు రోజుల కిందట అక్కినేని నాగార్జున కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిశారు. ఆయనతోపాటు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఉన్నారు. అయితే ఆది నుంచి జగన్మోహన్ రెడ్డితో నాగార్జునకు మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించింది. అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లి పరామర్శించడం ద్వారా జగన్ గూటికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కినేని నాగార్జున జగన్మోహన్ రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు. అది మొదలు వారిద్దరి మధ్య మంచి బంధం కొనసాగుతూ వస్తోంది. అయితే ఉన్నట్టుండి అక్కినేని నాగార్జున టిడిపి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల సాయంతో ప్రధానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అక్కినేని నాగార్జున జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పారని ప్రచారం నడుస్తోంది.
* మారిన పరిస్థితులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) ఏర్పాటు చేసే సమయంలో జగన్మోహన్ రెడ్డికి నాగార్జున అన్ని విధాల అండదండలుగా నిలిచారని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే నాగార్జున జైలుకు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని పరామర్శించారు. గత ఐదేళ్లుగా ఇటు ఏపీ ప్రభుత్వంతో పాటు అటు తెలంగాణ ప్రభుత్వంలో మంచి గుర్తింపు పొందారు నాగార్జున. రెండు తెలుగు రాష్ట్రాల పాలకులు తనకు సన్నిహితులుగా ఉండేవారు. అయితే ముందుగా తెలంగాణలో అధికారాన్ని కోల్పోయారు కేసీఆర్. తరువాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అయితే భాగ్యనగరంలో ఉన్న ఎన్ కన్వెన్షన్ హాల్ను తొలగించింది అక్కడి ప్రభుత్వం. అది నాగార్జునకు చెందిన ఆస్తి. అదే సమయంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయారు. ఇక్కడ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. నాగార్జునకు టిడిపి వ్యతిరేకం అన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ఎంపీ ఆధ్వర్యంలో ప్రధానిని నాగార్జున దంపతులు కలుసుకున్నారన్న ప్రచారం నడుస్తోంది.
* టిడిపి కార్యాలయానికి కుటుంబ సమేతంగా
మరోవైపు ఢిల్లీలోని ( Delhi)టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి నాగార్జున దంపతులు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు ఎంపీ శబరి వంటి వారు నాగార్జున కుటుంబానికి ఎంతో ఆదరించారని.. వారితో ఫోటోలకు సైతం దిగారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇదే కోపం తెప్పిస్తోంది.
* రాజకీయాలకు దూరం
జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) గత ఐదేళ్లుగా ఎన్నడు వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనింది లేదు. కానీ ఇప్పుడు ఏకంగా టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వెళ్లడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. ఇది జగన్మోహన్ రెడ్డికి జలక్ ఇవ్వడమేనని ప్రచారం నడుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అవసరాల కోసం ఆయన ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో బిజెపి మద్దతు తీసుకుంటున్నట్లు తెగ టాక్ నడుస్తోంది. అయితే నాగార్జున సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి. ఆయన కేవలం హీరో కాదు. సినీ పరిశ్రమలో వ్యాపారస్తుడు కూడా. పైగా ఏ రాజకీయ పార్టీతో ఆయనకు సంబంధం లేదు. అటువంటిప్పుడు ఆ కోణంలో చూడాల్సిన పనిలేదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.