Davos Tour : రాజకీయపరంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెసిఆర్, చంద్రబాబు వద్ద శిష్యరికం చేశారు. ఇదే విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. అనేక ఎదురుదెబ్బలు.. అనేక కేసులు ఎదుర్కొని ఆయన ముఖ్యమంత్రి దాకా ప్రయాణం సాగించారు. బలమైన కేసీఆర్ ను ఓడించి ముఖ్యమంత్రి కాగలిగారు.. గ్రూప్ రాజకీయాలకు చిరునామా ఐన కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి తీసుకు రాగలిగారు. అనైక్యత రాగాన్ని దూరం చేసి.. ఐక్యతా రాగాన్ని ఆలపించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టి.. అందులో విజయవంతమయ్యారు. ఇక తెలంగాణలో ఎలాగూ ప్రతిపక్ష స్థానంలో భారత రాష్ట్ర సమితి ఉండటం.. రేవంత్ వేస్తున్న ప్రతి అడుగును నిశితంగా పరిశీలించడం.. ప్రతిదానికి విమర్శ చేయడం అలవాటుగా మార్చుకుంది. సోషల్ మీడియా వేదికగా అడ్డగోలుగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. చివరికి దావోస్ లో పెట్టుబడి సదస్సును కూడా రాజకీయ కోణంలోనే ఆలోచిస్తోంది.
ఆరోగ్యకరమైన పోటీ
గత ఏడాది ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆ సమయంలో వివిధ కంపెనీలతో 40 వేల కోట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే ఆ విషయాన్ని కూడా భారత రాష్ట్ర సమితి కూడా రాజకీయం చేసింది. అడ్డగోలుగా విమర్శలు చేసింది. అయితే ఈసారి దావోస్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇటు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూరిచ్ లో కలుసుకున్నారు.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈసారి వీలైనంత ఎక్కువ కంపెనీలను ఆకర్షించాలని.. మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు రప్పించేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అధికారుల బృందంతో ఆయన ముందుగా చర్చలు జరిపారు. అధికారులతో అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించి.. అమలు చేస్తున్నారు.. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకున్న రాజకీయ అనుభవంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. మొత్తంగా అటు ఏపీ, ఇటు తెలంగాణ పోటాపోటీగా తమ రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్నాయి. ఈ పోటీ గతంలో ఉండేది కాదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆరోపణలు వినిపించేవి. గత ఏడాది ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు ఏపీకి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. కానీ ఏడాది తిరిగేలోపు పరిస్థితి మొత్తం ఒక్కసారిగా మారిపోయింది.