CM Revanth Reddy: సినిమాల బెనిఫిట్ షోలు.. టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇకనుంచి తెలంగాణలో అటువంటివి ఉండవని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. దీంతో ఆ ప్రభావం ఇప్పుడు ఏపీపై పడుతోంది. కూటమి సర్కార్ పై ఒత్తిడి పెరుగుతోంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల వేళ ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది. పుష్ప 2 చిత్ర విడుదల సమయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల నిర్ణయం తీసుకున్నాయి. బెనిఫిట్ షోల ప్రదర్శనతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చాయి. అయితే హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన, తగనంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవని.. టికెట్ ధరలు పెంచమని తేల్చి చెప్పింది. పుష్ప రెండు కోసం పెంచిన టికెట్ ధరలు సామాన్య ప్రజానీకానికి అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శ ఉంది. దీంతో తెలంగాణలో రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై సామాన్య ప్రజల నుంచి సానుకూలత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ నడుస్తోంది.
* తెలంగాణలో మంచి మార్కెట్
తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణలో విపరీతమైన మార్కెట్ ఉంటుంది. ఈ తరుణంలో అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిత్ర పరిశ్రమలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రంలో సినీ పరిశ్రమ విషయంలో సామాన్యులను దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇస్తే విమర్శలకు అవకాశం ఇచ్చినట్లే. తెలంగాణ సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం.. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ ను మరింత ఇరకాటంలో పెట్టినట్టే. కూటమి సర్కార్ తెలుగు సినీ పరిశ్రమకు అండగా నిలుస్తోంది. ఎటువంటి ప్రతికూల నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇప్పుడు తెలంగాణ సర్కార్ సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ కీలక నిర్ణయం తీసుకోవడం.. ఏపీ సర్కార్ పై ఒత్తిడి పెంచుతోంది.
* మూడు అతిపెద్ద సినిమాలు
తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సెంటిమెంట్. తెలుగు ప్రజల అతిపెద్ద పండుగ కావడంతో పెద్ద హీరోల సినిమాల విడుదల ఈ సమయంలోనే అధికం. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ తో పాటు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమాలు విడుదల కానున్నాయి. అయితే రామ్ చరణ్ తో పాటు బాలకృష్ణ విషయంలో ఎలాగూ కూటమి ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకోవాలి. ఈ ఇద్దరూ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బంధువులు. రేవంత్ తరహాలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సినీ ప్రముఖుల నుంచి ఒక రకమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితి కొనసాగిస్తే విమర్శలకు అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.