CM Ramesh: అనకాపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన సీఎం రమేష్ పై స్థానికేతర ముద్ర వేసేందుకు వైసిపి ప్రయత్నిస్తోంది. రాయలసీమ సంస్కృతి అంటూ కొత్త పల్లవి అందుకుంది. అయితే దీనిని అధిగమించేందుకు సీఎం రమేష్ సైతం అదే తరహా ప్రయత్నం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని సైతం విడిచిపెట్టడం లేదు. తనపై వేస్తున్న స్థానికేతర ముద్రను చెరిపి వేయడమే కాదు.. గతంలో ఇతర ప్రాంతాల్లో పోటీ చేసి గెలిచిన నేతలను గుర్తు చేసుకుంటూ ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో స్థానికులపై వేధింపులకు అడ్డుకట్ట వేసి నేను మీ వాడినేనని చెప్పుకునేందుకు సీఎం రమేష్ చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అవుతున్నాయి.
పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని బిజెపికి కేటాయించారు. బిజెపి అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయనకు బిజెపితో పాటు టిడిపి, జనసేన పార్టీ శ్రేణులు మద్దతు తెలుపుతున్నాయి. మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అయితే సీఎం రమేష్ పోటీ చేస్తుండడంతో ఈ స్థానం నుంచి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును అభ్యర్థిగా ప్రకటించారు జగన్. సీఎం రమేష్ ఓసి వెలమ కాగా.. ముత్యాల నాయుడు కొప్పల వెలమ. అనకాపల్లి నియోజకవర్గంలో వెలమలు అధికం. ఇద్దరు అభ్యర్థులను స్థానికులు స్వాగతిస్తున్నారు. అయితే ఇక్కడే జగన్ వ్యూహరచన చేశారు. సీఎం రమేష్ పై స్థానికేతర ముద్రవేయాలని బలమైన ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రమేష్ ను ఆర్థిక నేరస్తుడిగా చూపేందుకు ఆరాటపడుతున్నారు. అయితే కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ సైతం వైసిపి వ్యూహాలకు దీటుగా ముందుకు సాగుతున్నారు.
ఇటీవల ఓ టిడిపి సానుభూతిపరుడు దుకాణం పై జిఎస్టి అధికారులు దాడి చేశారు. దీంతో వారిని సీఎం రమేష్ అడ్డుకున్నారు. హైలెట్ అయ్యారు. సీఎం రమేష్ పై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే దీనిని గుర్తించిన సీఎం రమేష్ రెడ్ల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు తాను ఉన్నానని.. స్థానికులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏకంగా మీడియా సమావేశం పెట్టి అక్రమాలు ఎదిరించడానికి మరో జలగం వెంగళరావు అవుతానని ప్రకటించారు. ఎర్రం నాయుడు మాదిరిగా వ్యవహరిస్తానని కూడా చెప్పుకొచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఎర్రం నాయుడు కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అందుకే ఎర్రం నాయుడు ను గుర్తు చేసుకుంటూ జగన్ కు మరోసారి బుద్ధి చెబుతానంటూ సీఎం రమేష్ వ్యాఖ్యానించడం వ్యూహాత్మకమైన అని తేలింది. తన స్థానికత అంశంపై కూడా రమేష్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు ఒడిస్సా, నంద్యాలలో పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తాను పులివెందులకు ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. చోడవరంలో ఓ టైల్స్ యజమానిని కరణం ధర్మశ్రీ వేధిస్తుంటే అడ్డుకున్నానని కూడా గుర్తు చేశారు. అయితే అనకాపల్లిలో ఎలాగైనా సీఎం రమేష్ ను ఓడించాలని వైసిపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటి తరుణంలో అక్కడ పట్టు బిగించేందుకు సీఎం రమేష్ వ్యూహాత్మకంగా సాగుతున్న తీరు స్థానికుల ప్రశంసలను అందుకుంటోంది. అయితే ప్రజలు దీనిని ఎలా స్వీకరిస్తారో చూడాలి.