New Districts AP: ఏపీ ప్రభుత్వం( AP government) కొత్త జిల్లాల ఏర్పాటు పై దృష్టి పెట్టింది. ప్రధానంగా జిల్లాల సరిహద్దులు, పేర్లు మార్పు, మండలాల మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తోంది. ఇటీవల ఏడుగురు మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలు మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. అయితే నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఈ అంశాలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆ సబ్ కమిటీని ఆదేశించారు. జిల్లాల పేర్ల మార్పు, ప్రధాన కేంద్రాలు, డివిజన్లు, సరిహద్దులు, మండలాల అంశంపై కమిటీ పరిశీలన ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు.
Also Read: విశాఖ టు రాయపూర్.. దశ దిశ మారిపోయిందే!
* హేతుబద్ధత లేకుండా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే జిల్లాల విభజనలో హేతుబద్ధత పాటించలేదన్న విమర్శ ఉంది. అదే విషయాన్ని క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావించారు చంద్రబాబు. వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది డిసెంబరులోగా కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ఇతర అంశాలను తేల్చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని క్యాబినెట్ సబ్ కమిటీ ఒక నివేదిక తయారు చేయనుంది. అయితే అప్పట్లో చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వినతులు, అభిప్రాయాలను వైసీపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శ ఉంది. అందుకే ఇప్పుడు ప్రజాభిప్రాయానికి పెద్ద పీట వేయాలని సీఎం చంద్రబాబు సబ్ కమిటీని ఆదేశించారు.
* చాలా రకాల డిమాండ్లు
ఏపీ ( Andhra Pradesh) నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు, పేర్ల మార్పు, జిల్లాలతో పాటు మండలాలకు సంబంధించిన చాలా రకాల డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా ప్రజల నుంచి వినిపించింది. చంద్రబాబు సైతం ఎన్నికల ప్రచారంలో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలను కలుపుతూ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ అంశం కూడా తెరపైకి వస్తోంది. అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటి కాకుండా.. రాజంపేట ప్రధాన కేంద్రంగా ఉండాలని డిమాండ్ వినిపిస్తోంది.
* గోదావరి జిల్లాలో అలా..
మరోవైపు ఉభయ గోదావరి ( Godavari districts )జిల్లాల నుంచి సైతం అక్కడి ప్రజలు అనేక రకాల డిమాండ్లు వినిపిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. ఎప్పటికీ భీమవరం అక్కడ ప్రధాన కేంద్రంగా ఉన్న సంగతి తెలిసింది. శ్రీ సత్య సాయి జిల్లాకు సంబంధించి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలన్న డిమాండ్ అక్కడి ప్రజల నుంచి వస్తోంది. స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కేంద్రంగా పుట్టపర్తి ఉంది.
* మన్యంపై అభ్యంతరాలు
మరోవైపు గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జిల్లాల విషయంలో అనేక అభ్యంతరాలు ఉన్నాయి. వైసిపి ప్రభుత్వం 26 జిల్లాలను ప్రకటించగా.. రెండు గిరిజన జిల్లాలను కూడా ప్రకటన చేసింది. పాడేరు ప్రధాన కేంద్రంగా అల్లూరి సీతారామరాజు.. పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటయింది. అయితే మన్యం అన్న పేరు మార్చాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. రెవెన్యూ డివిజన్ల విభజనపై కూడా అనేక రకాల వినతులు వస్తున్నాయి. వీటన్నింటినీ వీలైనంతవరకు సరిచేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభం కానున్నాయి.