Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: పతుల కోసం ఆ నలుగురు సతుల ఆరాటం

AP Elections 2024: పతుల కోసం ఆ నలుగురు సతుల ఆరాటం

AP Elections 2024: ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. ఇది అక్షరాల సత్యం. ఇప్పుడు ఏపీలో దిగ్గజ నేతల విజయం కోరుతూ వారి సతీమణులు రంగంలోకి దిగుతున్నారు. ఎప్పుడు రాజకీయాల వైపు చూడని వారు.. పతుల కోసం ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తన భర్తను అకారణంగా జైల్లో పెట్టారని నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట పర్యటనలు సాగిస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ కు అండగా భార్య భారతి, నందమూరి బాలకృష్ణకు మద్దతుగా భార్య వసుంధర, నారా లోకేష్ కు అండగా భార్య బ్రాహ్మణి ఎన్నికల ప్రచారానికి సిద్ధపడుతున్నారు.

కడపలో వైయస్ కుటుంబానికి ఇప్పుడు కీలకం. కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. పులివెందులలో వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు పోటీ చేయనున్నారు. దీంతో ఇది ఒక సంకుల సమరం గా మారనుంది. ఇప్పటికే షర్మిల కడపలో తిష్ట వేశారు. సోదరుడు జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. వివేకానంద రెడ్డి హత్యను పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈ కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారని.. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో షర్మిలను ఎదుర్కోవాలంటే భారతి తప్పనిసరి అని జగన్ భావిస్తున్నారు. అందుకే జగన్ తరుపున భారతి పులివెందులలో ప్రచారం చేయనున్నారు. పోలింగ్ వరకు అక్కడే గడపనున్నారు.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పంలో పర్యటించనున్నారు. అక్కడ ప్రచార బాధ్యతలు తీసుకోనున్నారు. కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని జగన్ భావిస్తున్నారు. అందుకే అక్కడ భర్తకు మద్దతుగా నిలవాలని భువనేశ్వరి భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్త ప్రచారంలో చంద్రబాబు ఉండగా.. కుప్పంలో మాత్రం అన్ని తానై వ్యవహరించాలని భువనేశ్వరి స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు.

నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి టిడిపి శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన భార్య బ్రాహ్మణి మంగళగిరిలో భర్తకు మద్దతుగా ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆమె ఒక విడత పర్యటన పూర్తి చేశారు. పోలింగ్ వరకు మంగళగిరిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఈసారి నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. హిందూపురం నుంచి మూడోసారి బాలకృష్ణ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో బాలకృష్ణ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. అందుకే హిందూపురంలో భర్తకు మద్దతుగా ప్రచారం చేయాలని వసుంధర నిర్ణయించుకున్నారు. మొత్తానికి అయితే గతంలో ఏ ఎన్నికల్లో లేని హడావిడి నడుస్తోంది. పతుల విజయం కోసం సతులు ఆరాటం స్పష్టంగా కనిపిస్తోంది. మరి వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular