Rushikonda : తాము ఏం చేస్తున్నామో చెప్పుకోలేని స్థితిలో జగన్ సర్కారు ఉంది. ఏదైనా ప్రజాపయోగ నిర్మాణాలు చేపడితే వాటిని స్పష్టం చేయాలి. ప్రజలకు వెల్లడించాలి. కానీ జగన్ సర్కార్ ఎందుకో భయపడుతోంది. తాను ఏం చేస్తున్నానో చెప్పలేని పరిస్థితిలో ఉంది. విశాఖలో రిషికొండలో నిర్మాణాల విషయంలో ఇంతవరకు స్పష్టత లేదు. కానీ తాజాగా అక్కడ సెక్రటేరియట్ కడుతున్నట్లు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రకటించింది. పవన్ కళ్యాణ్ సందర్శన తరువాతే ఇలా ప్రకటన రావడం విశేషం.
వాస్తవానికి రిషికొండ విశాఖకు ల్యాండ్ మార్క్. లక్షలాది మంది పర్యాటకులకు ఇష్టమైన ప్రాంతం. చూడచక్కగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి ప్రసాదించిన వరం. కానీ అక్కడ కొండ ఆనవాళ్లు లేకుండా చేశారు. కొండను గుండు చేశారు. తొలుత అక్కడ పర్యాటక రంగ నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆ పేరుతో నిధులు కూడా మంజూరు చేశారు. అనుమతులు తీసుకున్నారు. కానీ అనుమతులకు మించి కొండను తవ్వేశారు. ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. జగన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ సైతం అక్కడే కట్టించుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అందులో తప్పేంటి అని మంత్రి బొత్స లాంటి వారు తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. ఇప్పుడు ఏకంగా సచివాలయమే నిర్మిస్తున్నామని చెబుతున్నారు. అక్కడ ఏం కొడుతున్నారో ధైర్యంగా ప్రభుత్వం చెప్పలేకపోతోంది. దౌర్భాగ్య పాలన చేస్తూ ఏదో ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి బలంగా పంపించే ప్రయత్నం చేస్తోంది.
రిషికొండపై కడుతున్న ఇళ్లు,దిగుమతి చేస్తున్న ఫర్నిచర్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ నిర్మాణాలు దగ్గరికి ఎవ్వర్నీ ఫోన్ ఇవ్వడం లేదు. డ్రోన్ కెమెరాలతో అక్కడ దృశ్యాలు పరిశీలిస్తే ఏ స్థాయిలో నిర్మాణాలు చేపడుతున్నారో అర్థమవుతుంది. ప్రజాధనాన్ని ఎంతలా దుర్వినియోగం చేస్తున్నారో తేటతెల్లమవుతుంది.
ఏ విషయంలోనైనా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. తాను చేసే పనులన్నీ ప్రజలకు చెప్పాలి. హోటల్ కడుతున్నామని ఒకసారి.. సీఎం క్యాంప్ ఆఫీస్ అని మరోసారి.. సెక్రటేరియట్ అని ఇంకోసారి చెప్పడం ఎంతవరకు సమంజసం. ప్రజలకు తెలుసుకునే హక్కు లేదా? ఇప్పటికే జీవోలను రహస్యంగా ఉంచుతున్నారు. ఇప్పుడు ప్రకృతి ప్రసాదించిన వనరులపై పడ్డారు. ప్రజల్లో అపోహలు, అనుమానాలను పెంచారు. వాటిని నివృత్తి చేయకుంటే మాత్రం ప్రజాక్షేత్రంలో నిలబడక తప్పదు.ఒకటి మాత్రం చెప్పగలం. రిషికొండకు చేసిన పాపాన్ని.. జగన్ సచివాలయం తో కడుగుకుంటున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.